బెంగళూరు, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కమీషన్రాజ్గా ముద్రపడ్డ కర్ణాటకలోని బీజేపీ పాలనలో మరో అవినీతి బాగోతం బయటపడింది! విధానసౌధకు వచ్చిన ప్రజాపనుల శాఖ జూనియర్ ఇంజనీర్ జగదీశ్ బుధవారం రూ.10.50 లక్షలతో పట్టుబడ్డాడు. విధానసౌధకు అంత పెద్ద నగదు మొత్తాన్ని పని వేళ ముగిసిన తర్వాత తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమిటనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. అవినీతి సొమ్మును కలిగి ఉన్నారనే ఆరోపణపై ఆయనపై కేసు దాఖలు చేశామన్నారు. జగదీశ్‌ను విధాన సౌధ భద్రతా సిబ్బంది తనిఖీ చేసినప్పుడు ఆయన సంచిలో రూ.10 లక్షలు కనిపించింది.
సాక్ష్యాధారాలను చూపకపోవటంతో నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ‘మండ్యకు డబ్బును తీసుకుని పోతున్నాను. పని మీద విధానసౌధకు వచ్చాను’ అని మాత్రం జగదీశ్ చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ‘డబ్బును ఎకడి నుంచి తెచ్చారు? ఎందు కోసం తెచ్చారు? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా జగదీశ్ సమాధానం దాటవేసినట్టు చెప్పారు. దీంతో అవినీతి సొమ్మును కలిగి ఉన్నారనే అభియోగంపై అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.