పానిపట్, జూలై 7: భర్తతో గొడవ పడి ఒంటరిగా రైల్వే స్టేషన్లో కూర్చొన్న మహిళపై కొందరు దుండగులు దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. బీజేపీ పాలిత హర్యానాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం వివరాలిలా ఉన్నాయి. భర్తతో గొడవ పడిన మహిళ(35) జూన్ 24న పానిపట్ రైల్వేస్టేషన్‌కు వచ్చి కూర్చుంది. ఆమె దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తి ఆమె భర్త పంపించాడని చెప్పి ఆమెను ఖాళీగా ఉన్న ఒక రైలు బోగీలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత మరో ఇద్దరు వ్యక్తులు కూడాఆమెను రేప్ చేశారు.
తర్వాత ఆమెను సోనిపట్ తీసుకెళ్లి రైలు పట్టాలపై పడేశారు. కొద్ది సేపటికే ఆమె పైనుంచి రైలు పోవడంతో బాధితురాలు కాలును కోల్పోయింది. తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయిన ఆమెను పోలీసులు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే తన భార్య కన్పించడం లేదని ఆమె భర్త జూన్ 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, స్పృహలోకి వచ్చిన బాధితురాలు తనపై సామూహిక లైంగిక దాడి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. సోనిపట్ పోలీసులు తర్వాత కేసును పానిపట్ రైల్వే పోలీసులకు బదిలీ చేశారు. ఈ కేసులో నిందితులను గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, రైల్వే పోలీస్ ఎస్‌హెచ్‌వో రాజేశ్ తెలిపారు.