ఆయనే సరైన నేతన్న జేడీయూ ఎంపీ
(స్పెషల్ టాస్క్ బ్యూరో), హైదరాబాద్ (నమస్తే తెలంగాణ) : ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. ప్రధాని పదవికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేరును టీఎంసీ అధినేత్రి మమత ప్రతిపాదించగా, ఇప్పుడు దానికి కౌంటర్‌గా ప్రధాని మోదీని ఓడించాలంటే నితీశ్ కుమార్లాంటి మచ్చ లేని నాయకుడు కావాలని నలంద జేడీయూ ఎంపీ కౌశలేంద్ర చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఇండియా కూటమిలోని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడానికి కృషి చేసిందే నితీశ్ అని కౌశలేంద్ర నొక్కిచెప్పారు. కూటమిలో నితీశ్‌కుమార్‌కు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించపోవడం వల్లనే కూటమిలో మనస్పర్ధలు వస్తున్నాయన్నారు. మమత ప్రతిపాదన అంతిమం కాదని, ప్రధాని పదవికి మల్లికార్జున ఖర్గే పేరును మమతా బెనర్జీ ప్రతిపాదించడం వెనుక, ఆయన సీనియర్ నాయకుడన్న మర్యాద మాత్రమే ఉందని ఆయన అన్నారు.