కొత్తగూడెం ప్రగతి మైదాన్, అక్టోబర్ 7: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను విడుదల చేసిన లేఖపై కొంతకాలంగా ఆ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ ప్రస్తుత మాడ్ డివిజన్ ఏరియా కమిటీ కార్యదర్శి సనిత పేరుతో మంగళవారం విడుదలైన లేఖ సంచలనం రేకెత్తిస్తోంది. తాజాగా శాంతి చర్చలపై మల్లోజుల 22 పేజీల లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన లేఖకు మద్దతుగా ఆ పార్టీ మాడ్ డివిజన్ కమిటీ నిలిచింది. సాయుధ పోరాటాన్ని త్యజించాలనే నిర్ణయానికి తమ కమిటీ మద్దతిస్తున్నట్లు సనిత పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని ప్రజలు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. తమ డివిజన్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని పార్టీకి, కార్యకర్తలకు వివరించాలని పేర్కొన్నారు. ఇకపై మాడ్ ఏరియాలో ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా బాధ్యత వహిస్తామని తెలిపారు.