(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ పురస్కారం లభించింది. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మాక్రోస్కోపిక్ క్వాంటం మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్లో లోతైన పరిశోధనలు చేసినందుకు గానూ శాస్త్రవేత్తలు జాన్ క్లార్క్, మైఖేల్ హెచ్ డెవొరెట్, జాన్ ఎం మార్టినిస్కు స్టాక్‌హోంలోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ పురస్కారాలను ప్రకటించింది. అవార్డులను దక్కించుకొన్న జాన్ క్లార్స్ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బార్కెలే)లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తుండగా, యేల్ యూనివర్సిటీతో పాటు శాంటాబార్బరాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో డెవొరెట్ సేవలు అందిస్తున్నారు. ఇక, మార్టినిస్ కూడా శాంటాబార్బరాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
ఏమిటీ పరిశోధన?
పరమాణువులోని ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, వాటి గమనం, శక్తి-సామర్థ్యాలను వివరించడానికి క్వాంటమ్ మెకానిక్స్ అవసరపడుతుంది. శక్తి హెచ్చు, తగ్గుల్లో తేడాలను ఎనర్జీ క్వాంటైజేషన్గా పిలుస్తారు. ఈ ఎనర్జీ క్వాంటైజేషన్లో మార్పులు ఇప్పటివరకూ కంటికి కనిపించనంత సూక్ష్మ స్థాయిల్లో జరిగేవి. అయితే, శాస్త్రవేత్తలు జాన్ క్లార్క్, డెవొరెట్, మార్టినిస్ మాత్రం తమ తాజా పరిశోధనల ద్వారా ఈ ప్రక్రియను చేతిలో పట్టుకొనేంత చిన్న చిప్‌లో వివరణాత్మకంగా చూయించగలిగారు. తద్వారా క్వాంటమ్ స్థాయి ప్రవర్తన అణుస్థాయికి మాత్రమే పరిమితం కాదని నిరూపించారు. తాజా ఆవిష్కరణతో క్వాంటమ్ కంప్యూటర్లలో విప్లవాత్మక మార్పులు పురుడుపోసుకోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తాజా పరిశోధనలతో ఎమ్మారై, అల్ట్రాసౌండ్ వంటి వైద్య పరీక్షల పరిధి కూడా మరింతగా విస్తృతమయ్యి.. త్వరితగతిన వ్యాధుల నిర్ధారణ జరిగే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు.