భోపాల్, మార్చి 28: భార్యతో అసహజ శృంగారం(సెక్స్) అత్యాచారం కింద పరిగణించకూడదని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. తన భర్త తనను లైంగికంగా వేధించాడంటూ ఒక మహిళ పెట్టిన కేసును హైకోర్టు గ్వాలియర్ బెంచ్ విచారించింది. ‘వయోజనురాలైన భార్యపై భర్త చేసే లైంగిక చర్య లేదా శృంగార చేష్టలు అత్యాచారం కిందకు రావు.
ఇందులో అంగీకారానికి సంబంధించిన విషయం అప్రధానమైనది’ అని సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ మిలింద్ రమేశ్ ఫడ్కే తీర్పు చెప్పారు. ఈ కేసులో అత్యాచార నిర్వచనాన్ని విస్తరించి మలద్వార, ముఖ మైథునం వంటి చర్యలను కూడా అందులో చేర్చినట్టు బెంచ్ గమనించింది. భార్యాభర్తల శృంగారంలో అలాంటి చర్యలకు భారత శిక్షాస్మృతి 377 సెక్షన్ను వర్తింప చేయరాదని బెంచ్ పేర్కొంది. ఈ సందర్భంగా ఆ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను పాక్షికంగా కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.