న్యూఢిల్లీ, డిసెంబర్ 5 : ఎన్డీఏ అంటే.. నో డాటా అవైలబుల్ అని ప్రతిపక్షాలు చేసే విమర్శలు నిజమే అన్నట్టుగా పార్లమెంటు సమావేశాలు సాగుతున్నాయి. దేశానికి సంబంధించిన అనేక అంశాలపై పార్లమెంటు సభ్యులు లోక్‌సభ, రాజ్యసభలో ప్రశ్నలు వేస్తుంటారు. వీటికి ఆయా శాఖల మంత్రులు సమాధానాలు సవివరంగా ఇవ్వాలి. అయితే, ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నది. అనేక ముఖ్యమైన అంశాలకు సంబంధించి ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ‘తమ వద్ద డాటా లేదు’ అంటూ కేంద్రమంత్రులు సమాధానం చెప్పడం ఆశ్చర్యపరుస్తున్నది. పరీక్షల్లో పేపర్ లీక్‌లు, విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై వివక్ష, ప్రభుత్వ దవాఖానల్లో వైద్య విద్యార్థుల ఆత్మహత్యలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించిన నష్టం.. ఇలా ఎంపీలు అడిగిన అనేక ముఖ్యమైన ప్రశ్నలకు కేంద్రం వద్ద వివరాలు లేవని మంత్రులు ప్రకటించారు.
ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలకు సంబంధించి ప్రభుత్వం డాటాను సేకరించడం లేదని హోంశాఖ బుధవారం పార్లమెంట్‌కు వెల్లడించింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న దవాఖానల్లో ఎంతమంది వైద్య విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న వివరాలు తమ వద్ద లేవని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం తెలిపింది. సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఇతర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎదుర్కొన్న వివక్షపై నమోదైన కేసుల వివరాల గురించి డాటాను నిర్వహించడం లేదని సమాధానం ఇచ్చింది. అలాగే పేపర్ లీక్‌లకు సంబంధించి అడిగిన ప్రశ్నకు సైతం కేంద్రం ఇలాంటి వివరణే ఇచ్చింది. ఇలా అనేక ప్రశ్నలకు ‘నో డాటా’ అంటూ కేంద్రమంత్రులు ఒకే సమాధానాన్ని ఇస్తున్నారు.
మోదీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న పలు బిల్లుల పేర్లు హిందీలోనే ఉండటం పట్ల గురువారం రాజ్యసభలో విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కొత్త బిల్లుల పేర్లన్నీ హిందీలోనే పెడుతూ సర్వం హిందీమయం చేస్తున్నారని ఆరోపించాయి. ద భారతీయ వాయుయాన్ విధేయక్, 2024 బిల్లు పేరును వెంటనే మార్చాలని డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్వీఎన్ సోము డిమాండ్ చేశారు. దేశంలోని 56 శాతం మందికి హిందీ మాతృభాష కాదని, రాజ్యాంగం ప్రకారం చట్టం పేరు ఇంగ్లిష్‌లో ఉండాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ బిల్లును తెలుగు మంత్రి అయిన కింజారపు రామ్మోహన్ నాయుడే ప్రవేశపెట్టారని బీజేపీ ఎంపీ ఘనశ్యామ్ తివారీ తెలిపారు.