ముంబై, జనవరి 1 (నమస్తే తెలంగాణ): వడ్డీ వ్యాపారుల వేధింపులకు గురై ఒక రైతు తన కిడ్నీని అమ్ముకున్న కేసు ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయంగా ఒక పెద్ద కుంభకోణాన్ని బట్టబయలు చేసింది. ఈ కేసులో కంబోడియాలోని ఒక సైనిక దవాఖానతో పాటు తమిళనాడు, ఢిల్లీకి చెందిన ప్రఖ్యాత వైద్యులకు కూడా సంబంధం ఉందని చంద్రపూర్ పోలీసులు గుర్తించారు. ఎస్పీ ముమ్మక్క సుదర్శన్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాగ్‌భిడ్ తాలూకాలోని మింతూర్కు చెందిన రోషన్ కుడే అనే రైతు.. వడ్డీ వ్యాపారుల వేధింపులకు తాళలేక తన కిడ్నీని 8 లక్షలకు అమ్మాడు. అయితే, వడ్డీ వ్యాపారులు అతన్ని వేధిస్తూనే ఉండటంతో, చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీనిపై దర్యాప్తు జరిపి ఈ రాకెట్‌ను ఛేదించారు.
బాధితులే ఏజెంట్లు…
ఈ కేసులో అరెస్టయిన షోలాపూర్‌కు చెందిన తెలుగు వ్యక్తి రామకృష్ణ సుంచు, హిమాన్షు భరద్వాజ్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ముందుగా తమ కిడ్నీలను అమ్ముకున్నారు. తరువాత, వారు ఎకువ డబ్బు కోసం దాతలను వెతికే ఏజెంట్లుగా మారారు. రోషన్ కుడే, రామకృష్ణ సుంచు కిడ్నీలను కంబోడియాలోని సైనిక దవాఖానలో తొలగించగా, హిమాన్షు కిడ్నీని తమిళనాడులోని తిరుచ్చిలోని స్టార్ కిమ్స్ దవాఖానలో తొలగించారు. సిట్ దర్యాప్తులో తమిళనాడులోని స్టార్ కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రాజరత్నం గోవిందస్వామి, ఢిల్లీకి చెందిన డాక్టర్ రవీంద్రపాల్ సింగ్‌ల ప్రమేయం బయటపడింది. ఇప్పటివరకు దేశంలో 10-15 అక్రమ కిడ్నీల మార్పిడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.