ఫిర్యాదులను చట్టప్రకారం పరిష్కరించాలి

- ఎస్పీ డాక్టర్ చేతన
నారాయణపేట, జనవరి 11: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చట్టప్రకారం పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని సీఐలు, ఎస్సైలను ఎస్పీ డాక్టర్ చేతన ఆదేశించారు. సోమవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల దినం సందర్భంగా ఫిర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సివిల్ సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించారు. కొవిడ్-19 కారణంగా ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులను గ్రామాల్లో లేదా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టలో వేయాలన్నారు.
ఊళ్లకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలి
సంక్రాంతి పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డాక్టర్ చేతన తెలి పారు. సోమవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ సెలవుల కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి పలు సూచనలు అందించారు. ప్రజలు తమ ఇండ్లు, పరిసరాలు, కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లను రోడ్లపై కాకుండా ఇంటి ఆవరణలో పార్కింగ్ చేయాలని, బీరువా తాళాలను ఇండ్లల్లో ఉంచకుండా తమ వెంట తీసుకెళ్లాలని చెప్పారు. ఎక్కువ రోజులు విహారయాత్రకు వెళ్లేవారు పేపర్, పాలవారిని రావొద్దని తెలియజేయాలన్నారు. విలువైన వస్తువుల సమాచారం ఇతరులకు చెప్పొద్దని, బంగారు నగలు ఉంటే బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలని, విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలని సూచించారు. సొంత ఇండ్లు ఉంటే ఇంటి ప్రధాన ద్వారానికి గ్రిల్స్ ఏర్పాటు చేసుకోవాలని, పోలీస్ స్టేషన్ నంబర్, బీట్‌కు వచ్చే కానిస్టేబుల్ నెంబర్ దగ్గర పెట్టుకోవాలన్నారు. ఊరికి వెళ్లేటప్పుడు చుట్టుపక్కల వారికి లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. దొంగతనాల నివారణకు కాలనీల్లో స్వచ్ఛందంగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై 100కు డయల్ లేదా 7901400100 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.