గురువారం 04 జూన్ 2020
Narayanpet - Feb 03, 2020 , 23:45:13

సహకారం మరువలేనిది

సహకారం మరువలేనిది

 నారాయణ పేట ప్రతినిధి/నమస్తే తెలంగాణ : నూతనంగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో తొలి పూర్థిస్థాయి కలెక్టర్‌గా పనిచేయడం మరిచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చిందని, ఇక్కడున్న వారు అందించిన సహకారం మరవలేనిదని కలెక్టర్‌ వెంకట్రావు అన్నారు. దాదాపుగా సంవత్సర కాలం కలెక్టరుగా పనిచేసి మహబూబ్‌నగర్‌కు బదిలీ అయిన సందర్భంగా కలెక్టర్‌ వెంకట్రావు సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

నమస్తే తెలంగాణ : నూతనంగా ఏర్పడిన నారాయణపేట జిల్లాకు మొదటి పూర్తిస్థాయి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించడం ఎలా ఉంది? 

 కలెక్టర్‌ : నారాయణపేట జిల్లా ఏర్పడిన తరువాత మొదటి పూర్తిస్థాయి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహంచడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అప్పటి వరకు వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వహంచిన నాకు కొత్తగా ఏర్పడిన నారాయణ పేట జిల్లాకు కలెక్టర్‌ హోదాలో బాధ్యతలు నిర్వహించడం మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది.

రాష్ట్రంలో అన్ని విధాలుగా వెనుకబడి ఉన్న జిల్లాలో సంవత్సర కాలం కూడా పూర్తి కాకుండగానే బదిలీ కావడం పట్ల మీ అభిప్రాయం ఏమిటీ ?

నారాయణపేట వెనుకబడిన జిల్లా కావచ్చు. ఈ జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు చూపిన ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్‌ల బదిలీలలో భాగంగా నా బదిలీ జరిగింది. అంతే తప్పా ప్రత్యేక కారణాలు ఏమీ లేవు. కలెక్టర్‌గా విధులు నిర్వహించింది కొన్నిరోజులే అయిన రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చి జాతీయ అవార్డులను సైతం సాధించాము.

జిల్లాలో మీకు ప్రత్యేక గుర్తింపును  తెచ్చిన కార్యక్రమాలు ఏవీ?

జిల్లాలో చేపట్టిన ప్రతి కార్యక్రమం వినూత్నమైనదే. ప్రత్యేకించి పల్లె ప్రగతి, హరితహారం, ఆత్మీయుడు, కార్యాలయాలలో బయోమెట్రిక్‌  విధానం, ఈ-ఆఫీసుల ఏర్పాటు, ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటిని అం దించిన కార్యక్రమాలు, మహిళలు, విద్యార్థుల ప్రయోజనాలను దృష్ఠిలో ఉంచుకొని చేపట్టిన కార్యక్రమాలు మంచి సంతృప్తిని మిగిల్చాయి.

జాతీయ స్థాయిలో ఏఏ కార్యక్రమాలకు అవార్ఢులు వచ్చాయి ?

హరితహారం, ఈ-ఆఫీసుల ఏర్పాటుకు సంబంధించి జాతీయ స్థాయిలో రెండు స్కోచ్‌ అవార్డులు ఒకేసారి వచ్చా యి. జిల్లాగా ఏర్పడిన సంవత్పర కాలంలోనే ఈ అవార్డులు రావడం ఇక్కడి అధికారులు, సిబ్బంది పనితీరుకు నిదర్శనం. 

మీకు ఈ సంవత్సర కాలంలో అత్యంత ఆనందాన్ని, అత్యంత బాధాకరమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా..?

పూర్థి స్థాయిలో ఈ-ఆఫీసులను ఏర్పాటు చేయడం నాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చింది. మరికల్‌ మండలం తీలేరు గ్రామంలో జరిగిన ప్రమాదంలో 10మంది కూలీలు మృతి చెందిన సంఘటన అత్యంత బాధాకరమైన సంఘటన. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంతో కొంత ఉపశమనాన్ని కలిగించింది.

జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారం ఏ మేరకు లభించింది ?

అందరి సహకారం నాకు ఉండండం వల్లె కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేయగలిగాం. జాతీయ స్థాయిలో అవార్డులను సాధించగలిగాం. పూర్తి స్థాయిలో కార్యాలయాలు ఏర్పాటై, అధికార యంత్రాంగం వస్తే జిల్లా అన్ని రంగాలలో వేగంగా అభివృద్ధి సాధించేందుకు కావల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయి. 


logo