హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) : వేతన సవరణలో భాగంగా ద్రవ్యోల్బణం దృష్ట్యా పీఆర్సీలో 40శాతం ఫిట్‌మెంట్‌ను మంజూరు చేయాలని తెలంగాణ గెజిడెట్ అధికారుల సంఘం (టీజీవో) పీఆర్సీ కమిటీని కోరింది. ఉద్యోగుల కనీస వేతనం రూ. 32 వేలు, గరిష్టవేతనం రూ. 2,95,460 ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. వార్షిక ఇంక్రిమెంట్ రేటు 2.6శాతం నుంచి 3శాతంగా ఉంచాలని కోరింది.
ఈ మేరకు టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్‌రావు, ప్రధానకార్యదర్శి ఎనుగుల సత్యనారాయణ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం బీఆర్కేభవన్లో పీఆర్సీ కమిటీ చైర్మన్ ఎన్ శివశంకర్‌తో భేటీ అయ్యింది. గతంలో టీజీవో నేతలు అందించిన సిఫారసులపై చర్చించేందుకు పీఆర్సీ కమిటీ వారిని ఆహ్వానించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో 28శాతం హెచ్ఆర్ఏ, జిల్లా కేంద్రాల్లో 20%, రెవెన్యూ డివిజన్లు, మున్సిపాలిటీలు, మండలకేంద్రాల్లో 17%, ఇతర ప్రాంతాల్లో 15%హెచ్ఆర్ఏ అమలు చేయాలని టీజీవో నేతలు కోరారు. 20 ఏండ్లకే పూర్తి పెన్షన్‌ను మంజూరు చేయాలని, గ్రాట్యుటీ మొత్తాన్ని 25 లక్షలకు పెంచాలని కోరారు. కనీస కుటుంబ పెన్షన్‌ను 16 వేలకు పెంచాలని, మెడికల్ అలవెన్సును 12 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. కాగా, వేతన సవరణలో నాల్గో తరగతి ఉద్యోగులకు 51% ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని పీఆర్సీ కమిటీ చైర్మన్ ఎన్ శివశంకర్‌ను తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, ప్రధానకార్యదర్శి గంగాధర్ కోరారు.