నల్లగొండ/నీలగిరి/చండూరు, మే 3 : ఎంతో ఉద్యమ చరిత్ర కలిగిన నల్లగొండ జిల్లా అభివృద్ధిని పట్టించుకోకుండా పదవుల మీద యావతో గాలికి వదిలేసిన చరిత్ర జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డిది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ భువనగిరి, నల్లగొండ ఎంపీ అభ్యర్థులు క్యామ మల్లేశ్, కంచర్ల కృష్ణారెడ్డి గెలుపు కోసం శుక్రవారం ఆయన చండూరు, నల్లగొండలో రోడ్ షో నిర్వహించారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, అభ్యర్థులు క్యామ మల్లేశ్, కంచర్ల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య రోడ్‌షోలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ 30 ఏండ్ల పాటు నల్లగొండను ఏలిన ఈ నలుగురు పదవుల కోసం ఆంధ్రోళ్ల దగ్గర మోకరిల్లారని, దాంతో జిల్లా అభివృద్ధి జరుగలేదన్నారు. జానారెడ్డి, కోమటిరెడ్డి నల్లగొండ, సూర్యాపేటకు మెడికల్ కాలేజీలు ఎందుకు తేలేదని, వారికి కానిది జగదీశ్‌రెడ్డితో ఎందుకు సాధ్యమైందని ప్రశ్నించారు. మెడికల్ కళాశాలలతో పాటు ఐటీ హబ్, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ తెచ్చిన ఘనత బీఆర్ఎస్దేనని చెప్పారు. కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో రెండు పదవులు ఉంటే, జనారెడ్డి ఇంట్లో ఒకే పదవి ఉందని ఇంకో కొడుకుకు పదవి కావాలని తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు.
పొద్దున లేస్తే రేవంత్ రెడ్డి బూట్లు నాకుతూ కేసీఆర్‌ను తిట్టే కోమటిరెడ్డి ఆసరా పింఛన్ రూ.4వేలు ఎందుకు ఇస్తలేడని, రైతు బంధు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ఉద్యమం అంటే ఏంటో తెలియని రేవంత్ సీఎం అయ్యాడని, ఆయన ఏ ఒక్క రోజన్నా ఉద్యమం చేసిండా అని విమర్శించారు. ఇదే నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో ఎన్నో ఉద్యమాలు జరుగటం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే జానారెడ్డి ఇంట్లో ఒక ఉద్యోగం వస్తది తప్ప నల్లగొండ ప్రజల సమస్యలు ప్రశ్నించే అవకాశం ఉండదన్నా రు. కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపిస్తే ఆయన పార్లమెంట్లో, తాము అసెంబ్లీలో గొంతెత్తి ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో కంకర దొంగలు, భూ కబ్జాదారులు, ఇసుక దొంగలు ఉన్నారని, బీఆర్ఎస్లో మాత్రం ఉద్యమకారులు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లో కొంతమంది మంత్రులు ఆగుతలేరని, గాల్లో తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులను భూమి మీద ఉంచాలంటే క్యామ మల్లేశ్‌ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతుందని, అక్కాచెల్లెళ్లలకు కాంగ్రెస్ పార్టీ 10 వేల రూపాయలు బాకీ పడ్డదని అన్నారు. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనే పరిస్థితి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం రామన్న మీద, యాదగిరిగుట్టలో నరసన్న మీద, వేములవాడలో రాజన్న మీద ఒట్టేసి ఆరు గ్యారెంటీలతో పాటు రుణమాఫీ చేస్తానని ఒట్లు వేస్తున్నాడని చెప్పారు. ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తానని తాను సవాల్ చేశానని తెలిపారు. రాహుల్ గాంధీ సంతకం ఫోర్జరీ చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఎందుకు ఎంపీ టికెట్ ఇచ్చారో చెప్పాలన్నారు. కేంద్రంలో పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఒక మంచి పని కూడా చేయలేదని చెప్పారు. నిత్యావసర సరుకులతోపాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాట మీద ఉండే కేసీఆర్ అభివృద్ధిలో భాగంగా చండూరును రెవెన్యూ డివిజన్ చేశారని తెలిపారు. మునుగోడు ప్రాంతానికి రూ.570 కోట్లు మంజూరు చేసి అభివృద్ధికి బాటలు వేశారని చెప్పారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొత్త పథకాలు రాలేదని, ఉన్న పథకాలు ఊడిపోతున్నాయని అన్నారు. ప్రజలు ఆలోచించాలని, బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ తెల్ల కాగితం లాంటివాడని, మచ్చలేని నాయకుడని, ఈ నెల 13న కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజసింహారెడ్డి, బీఆర్ఎస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి, మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, మాజీ ఎంపీపీ పల్లె కళ్యాణి రవికుమార్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన జనంతోపాటు బీఆర్ఎస్ శ్రేణులతో చండూరు, నల్లగొండ పట్టణాలు గులాబీమయంగా మారాయి.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అన్ని చెరువుల్లోకి నీళ్లు తెస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లోనే రైతుల కండ్లలో కన్నీళ్లు తెచ్చింది. 14 ఏండ్లు కష్టపడి రైతు బిడ్డగా వ్యవసాయాన్ని పండుగగా మారిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కరువు ప్రాంతంగా ప్రకటించేలా చేస్తున్నది. రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకున్నది. 1.12 కోట్ల ఎకరాలకు సాగునీరు ఇచ్చి 3కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించింది. కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా క్వింటాల్ ధాన్యానికి 500 రుపాయల బోనస్ ఇస్తానని చెప్పి పైసా కూడా ఇవ్వలేదు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి. ఒక్కసారి అవకాశం ఇచ్చి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి.
-బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి
‘మంత్రులుగా పనిచేసిన జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి దామెదర్‌రెడ్డి నల్లగొండ జిల్లాలో చేసిన అభివృద్ధిపై, నేను మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం. జానారెడ్డి నియోజకవర్గం సాగర్‌లోనైనా, నా నియోజకవర్గం సూర్యాపేటలోనైనా, ఉమ్మడి జిల్లాకు వేదికగా ఉన్న క్లాక్‌టవర్ సెంటర్‌లోనైనా ఇందుకు రెడీగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో తమను తామే బొంద పెట్టుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన మోసాలను ప్రజలు అర్థం చేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చేప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.
35 ఏండ్లు జిల్లాను ఏలిన జానారెడ్డి జిల్లాకు చేసింది శూన్యం. కరువు కాటకాలను సృష్టించి ఫ్లోరైడ్‌తో ప్రజల నడుములు వంచారు. జిల్లా ప్రజలు ఆయనను తరిమేస్తే అడ్డదారిన కొడుకులను తీసుకొచ్చి అంతా తానే అభివృద్ధి చేశానని చెప్పడం విడ్డూరంగా ఉంది. 17 సంవత్సరాలుగా మంత్రిగా పనిచేసిన జానారెడ్డి సొంత గ్రామానికి నీళ్లు ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో రాజవరం మేజర్ లిఫ్ట్‌ను ఏర్పాటు చేసి ఆ గ్రామ ప్రజలకు నీరిచ్చాం. నల్లగొండకు రూ.1500 కోట్లు, సూర్యాపేటకు రూ.1400కోట్లు, భువనగిరికి రూ. 1200కోట్లు అఖరి సాగర్ నియోజకవర్గానికి కూడా వందల కోట్ల రుపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేశాం. 50 ఏండ్లుగా సాగర్ నియోజకవర్గంలో సగం గ్రామాలకు నీరు లేదు.
టెయిల్‌పాండ్ అని ప్రత్యేక పదం సృష్టించి ప్రజలకు అన్యాయం చేస్తే మేము వచ్చాక ఆ పదమే కనబడకుండా చేసి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చాం. పదేండ్లలో ఎక్కడ కూడా ఎకరం పొలం ఎండలేదు. కాంగ్రెస్ వచ్చిన నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు ఎండబెట్టింది. సాగర్ నీళ్లు ఆంధ్రాకు తరలిపోతుంటే పదవులకు భయపడి నోరెత్తలేదు. జిల్లా నుంచి జానారెడ్డి పెద్ద పదవులు అనుభవించినా జిల్లాకు చేసినవి చిన్నపనులే. ఆయనకు, ఆ కుటుంబానికి ఓట్లడిగే అర్హత లేదు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కటౌట్లు, బ్యానర్లు చింపి కార్యకర్తలను బెదిరిస్తున్నారు. నాయకులు పోయినా వందలాది కార్యకర్తలు బీఆర్ఎస్లోనే ఉన్నారు.’
కోమటిరెడ్డి బ్రదర్స్ వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి భువనగిరి, మునుగోడుకు చేసిందేమీ లేదు. స్వలాభాల కోసంరాజకీయాలు చేయడం తప్ప అభివృద్ధి గురించి ఏనాడూ వారు మాట్లాడరు. రాజగోపాల్‌రెడ్డి చామల కిరణ్ కుమార్‌రెడ్డిని గెలిపించి తాను మంత్రి కావాలని ఆరాటపడుతున్నారు. అది కలగానే మిలిగి పోతుంది. ప్రజల్లో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉన్నది. వడ్లు నానపోస్తే తాళ్ల గింజలులాగా ఉన్న వారిని నేడు పార్టీలో చేర్చుకుంటూ ఏదో తాము గెలవబోతున్నామని కాంగ్రెస్ నాయకులు ప్రగల్బాలు పలుకుతున్నారు. టైగర్ అని చెప్పుకునే వాళ్లు గడ్డి తింటూ నేడు ప్రజలకు గడ్డి పెడుతున్నారు.
నల్లగొండ జిల్లాలో బడుగు బలహీన వర్గాల చెందిన బడుగుల లింగయ్య యాదవ్‌ను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దే. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే యాదవులకు సముచిత స్థానం లభించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక యాదవ బిడ్డకు కూడా న్యాయం జరుగలేదు. ప్రజలందరి ఆశీర్వాదంతో నేను ఎంపీ అయి మీ తరఫున పార్లమెంట్లో గొంతు వినిపిస్తా. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి.
– చండూర్ రోడ్ షోలో బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్
గతంలో గెలిచిన ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు జిల్లాకు ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ది రాజకీయ స్వార్థమే. మునుగోడు పౌరుషమున్న గడ్డ. చండూర్ రోడ్ షోకు ప్రజలు ఎంత అభిమానంతో వచ్చారో చూస్తుంటే కోమటిరెడ్డి బ్రదర్స్‌కు బీఆర్ఎస్ గెలుపు పక్కా అనే విషయం తెలియాలి. ప్రజలంతా ఆలోచించాలి. ప్రజలకు అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే తపన తప్ప కేసీఆర్‌కు వేరే ఆలోచన ఉండదు. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం భువనగిరి పార్లమెంట్ ప్రజలను తాకట్టు పెట్టాలని చూస్తున్నారు. కారు గుర్తుపై ఓటు వేసి క్యామ మల్లేశ్‌ను గెలిపించాలి.
-చండూర్ రోడ్ షోలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, బ్యానర్లు కటౌట్లు చించినంత మాత్రన కేసీఆర్‌పై, బీఆర్ఎస్పై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని తుడుపలేరు. నాయకులను కొనుగోలు చేసినంత మాత్రన బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడి పోలేదు. ప్రతి కార్యకర్తకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటాం. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ గడ్డపై ఉంటా. 20 ఏండ్లు నల్లగొండను అభివృద్ధికి దూరం చేస్తే నేను రూ.1500 కోట్లతో అభివృద్ధి చేశాను.
-నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి