దామరచర్ల, జూన్ 24 : మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఎంఈఓ బాలాజీ నాయక్, వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా దామరచర్ల మండలంలోని బొత్తలపాలెం ఆదర్శ పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు అలవాటు పడితే మంచి భవిష్యత్ కోల్పోతారని, కౌమార దశ నుండే మద్యం, మత్తుకు దూరంగా ఉండి క్రమశిక్షణతో మెలగాలని సూచించారు.
డ్రగ్స్ అవశేషాలు కలిగిన పదార్థాలను స్వీకరించినట్లయితే మానసిక రుగ్మతలకు గురౌతారని, ఉపాధ్యాయుల సూచనలు పాటించి జీవితంలో సంపూర్ణ ఆరోగ్యం కలిగిన పౌరుడిగా ఎదగాలన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ విద్య వైపు దృష్టి సారించి కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నరహరి, ఉపాధ్యాయులు బాబ్లా, ఆయాజ్ ఖాన్ పాల్గొన్నారు.