రామగిరి(నల్లగొండ), ఏప్రిల్ 05 : యువత దేశ మాజీ ఉప ప్రధాని, దివంగత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అంటరాని వారికి తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. అందరూ సమానంగా ఉండాలని, అంటరానితనమన్నదే ఉండకూడదని, అంటరానితనం నిర్మూలనకు కృషి చేసినట్లు తెలిపారు. వ్యవసాయ, రక్షణ శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఎన్నో మార్పులను తీసుకొచ్చారని, ప్రత్యేకించి వ్యవసాయంలో హరిత విప్లవానికి కృషి చేశారని కొనియాడారు. ఈరోజు దేశంలో ఎగుమతులు ఉన్నత స్థాయిలో ఉన్నాయంటే దానికి కారణం జగ్జీవన్ రామ్ అన్నారు. జగ్జీవన్ రామ్ కూతురు మీరాకుమార్ లోక్‌సభ స్పీకర్‌గా తెలంగాణ బిల్లును పాస్ చేయడంలో కీలక పాత్ర పోషించనట్లు తెలిపారు.
నల్లగొండ జిల్లా అభివృద్ధిలో భాగంగా ఈ నెల 7న అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు, దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం, ప్రత్యేకించి దళితులకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ క్రమ పద్ధతిలో జీవన విధానం మలచుకుని ముందుకు వెళ్లి జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళులర్పించిన వారమవుతామన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ బాగుకు రూ.25 లక్షలు జిల్లా మినరల్ ఫండ్ నుండి ఇవ్వాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ను కోరారు. అంతేకాక తన ఎమ్మెల్యే నిధుల నుండి మరికొంత మొత్తాన్ని ఇస్తానని తెలిపారు.
రాజీవ్ యువ వికాసం కింద దళితులకు స్వయం ఉపాధి అవకాశాలు ఎన్నో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా దళిత యువతకు మంత్రి సూచించారు. జిల్లా కేంద్రంలో ఎస్సీ స్టడీ సెంటర్ ఏర్పాటు చేస్తామని, అంతేగాక వన్ టౌన్ లో ఉన్న లైబ్రరీ పూర్తిగా శిథిలావస్థలో ఉన్నందున దాని స్థానంలో మోడల్ లైబ్రరీని నిర్మిస్తామని, ఎస్ఎల్బీసీ వద్ద 25 ఎకరాలల్లో అన్ని వర్గాల వారికి 6 నుండి 12వ తరగతి వరకు చదివేందుకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు, ఇందుకు ప్రభుత్వం రూ.30 కోట్లు ఇదివరకే మంజూరు చేసిందని, వచ్చే నెలలో టెండర్లు పిలువనున్నట్లు మంత్రి తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ఎలాంటి వనరులు లేని బీహార్‌లోని అత్యంత వెనుకబడిన “ఆరా” ప్రాంతం నుండి వచ్చిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అంచలంచెలుగా ఎదుగుతూ భారత ఉప ప్రధాని అయ్యారని, వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని, ప్రతి ఒక్కరూ వారి వ్యూహాన్ని నేర్చుకోవాలన్నారు. గంగ పరివాహక ప్రాంతంలో గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావడంలో, ఆ ప్రాంతాన్ని వీట్ బౌల్ గా ఎలా చేయాలో అన్న విషయమై జగ్జీవన్ రామ్ చేసిన అధ్యయనం గొప్పదన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా తన స్పష్టమైన మార్పు చూయించారన్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడని, చేపట్టిన ప్రతి పోర్ట్ పోలియోలో తనదైన ముద్ర వేసినట్లు తెలిపారు. దళిత వర్గాలకు ఆయన చేసిన కృషి మరువలేనిదని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. అంతకుముందు మర్రిగూడ చౌరస్తాలో ఉన్న జగ్జీవన్ రామ్, బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్, రామరాజు, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, దున్న యాదగిరి, బొర్ర సుధాకర్ తదితర దళిత నాయకులు మాట్లాడారు.