శాలిగౌరారం, జూన్ 23 : విద్యుత్ స్తంభం ఎక్కిన యువకుడికి షార్ట్ సర్క్యూట్ కావడంతో స్తంభం పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డ సంఘటన శాలిగౌరారం మండలంలోని భైరవునిబండ గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముప్పటి నవీన్ అనే యువకుడు తన వ్యవసాయ బావి వద్ద అమర్చిన బోరు మోటర్‌కు కనెక్షన్ కోసం వైర్లను కలిపేందుకు స్థానిక సబ్ స్టేషన్‌లోని ఆపరేటర్‌కు ఫోన్ చేసి కరెంట్ సరఫరాను నిలిపివేయాలని సమాచారం ఇచ్చాడు.
అంతలోనే నవీన్ అనే యువకుడు స్తంభం ఎక్కి వైర్లను కలుపుతున్న క్రమంలో ఆపరేటర్ గమనించక కరెంట్‌ను పునరుద్ధరించడంతో విద్యుత్ షాక్‌కు గురై స్తంభం పై నుండి కిందపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే నల్లగొండలోని ప్రైవేట్ దవాఖానాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా సోమవారం బాధితుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు స్థానిక సబ్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆపరేటర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని, తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సబ్ స్టేషన్ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపు తప్పకుండా చూశారు. విద్యుత్ ఏఈ అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడారు.