చిట్యాల, జూన్ 25 : కొట్లాటలకు వెళ్లవద్దని తండ్రి మందలించాడనే కారణంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం కేంద్రంలో బుధవారం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాలలోని 12వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ రెముడాల లింగస్వామి కుమారుడు గణేశ్ (21), అతడి మిత్రులకు మరికొంత మందికి మంగళవారం రాత్రి చిన్న గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో లింగస్వామి తన కుమారుడిని గొడవలకు వెళ్లవద్దని మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన గణేశ్ బుధవారం తెల్లవారుజామున స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గణేశ్ మృతదేహాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరశం, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వేర్వేరుగా సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.