కట్టంగూర్, మే 28 : ప్రతీ ఒక్కరిలో మానసిక ప్రశాంతత పెంచేందుకు యోగా దోహద పడుతుందని ఆయుష్ డిస్పెన్సరీ వైద్యాధికారి ఊర్మిళ అన్నారు. బుధవారం మండలంలోని ఆయిటిపాముల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ కార్యక్రమాన్ని ప్రారంభించి, పల్లె దవాఖాన ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాతో శారీరకంగా, మానసికంగా మార్పులు రావడంతో పాటు ఏకాగ్రత పెరుగుతుందన్నారు.
ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి జూన్ 21 వరకు నిర్వహించే యోగా దశాబ్ది వేడుకల్లో ప్రజలు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం యోగా దశాబ్ది వేడుకల బ్రోచర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఫార్మాసిస్టులు ఉమారాణి, సైదులు, యోగా మాస్టర్లు శరత్, నిర్మల, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.