కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం, బాధ్యతారాహిత్యంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రధానంగా చెరువులకు గత ఉమ్మడి రాష్ట్ర దుస్థితి దాపురిస్తున్నది. నాడు చుక్కనీరు లేక ఎండిపోగా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరంతో ఏడేండ్ల పాటు సూర్యాపేట జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టు జలకళతో కళకళలాడింది. చెరువులు ఏడాది అంతా నిండుగా ఉండి భూగర్భ జలాలు పెరిగాయి. కానీ మళ్లీ నీటి కష్టాలు మొదలయ్యాయి. కాళేశ్వరం జలాలు రాక చెరువులు వట్టిపోయి పంటలు ఎండిపోతున్నాయి. ఈ స్థాయిలో నీటి సంకటం వస్తుందని రైతులు కలలో కూడా ఊహించి ఉండరు. సూర్యాపేట జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో 732 చెరువులు, కుంటలు ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు లేక ముందు 2014లో నీళ్లు లేక 85 శాతం చెరువులు ఖాళీగా దర్శనమిచ్చేవి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వంద శాతం చెరువులు జలకళ సంతరించుకున్నాయి. చిన్న సాకును చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని పండబెట్టడంతో ప్రస్తుత యాసంగి సీజన్లో చెరువులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
కేసీఆర్ హయాంలో ఏడేండ్లపాటు సస్యశ్యామలం
ఉమ్మడి రాష్ట్రంలో 60శాతానికి పైనే చెరువుల్లో అక్కడక్కడ గుంతల్లో అతికొద్ది మేర ఎండ మావుల్లా మచ్చుకు నీరు ఉండేది. వాటితో సాగుమాట దేవుడెరుగు కనీసం పశువుల దాహం కూడా తీరేది కాదు. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో 732 చెరువులు, కుంటలు ఉండగా 10శాతం చెరువుల్లో కూడా నీరు ఉండకపోయేది. అలాంటి దయనీయ దుస్థితి నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు.. మన చెరువు పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చించి విస్తరిలా ఉన్న చెరువులను గంగాళాల్లా మార్చారు.
అలాగే సాగునీటి గోసను తీర్చేందుకు అపర భగీరథుడిలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. దీంతో 2017 నుంచి 2023 వరకు సూర్యాపేట జిల్లా ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని చెరువులన్నీ జలకళ సంతరించుకున్నాయి. నీళ్లు పుష్కలంగా ఉండడంతో ఏడేండ్ల పాటు రైతులు పండుగలా వ్యవసాయం చేశారు. జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలతోపాటు కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతె, మునగాల, నడిగూడెం మండలాల్లో అత్యధికంగా చెరువులు ఉన్నాయి. కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లో కొది మేర మాత్రమే చెరువులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని పట్టించుకోకపోవడంతో గోదావరి నీళ్లు రాక ప్రస్తుతం ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని
చెరువులు వెలవెలబోతున్నాయి.
పడిపోయిన భూగర్భ జలాలు
బీఆర్ఎస్ హయాంలో నిరంతరం గోదావరి జలాల విడుదలతో ఎస్సారెస్పీ కాల్వలు నిండుగా ప్రవహించేవి. మండు వేసవిలో సైతం 60 శాతం చెరువులు అలుగులు పోశాయి. కాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు ఆన్ చేయకపోవడంతో నీళ్లు రాక 70 శాతం చెరువుల్లో నీరు అదఃపాతాళానికి పడిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ఒక్క చెరువు కూడా ఎండిపోలేదు. 2023 డిసెంబర్ వరకు 102 చెరువులు అలుగు పోయగా 75 నుంచి 100 శాతం జలకళతో ఉన్నాయి. 237 చెరువులు 50 నుంచి 75 శాతం నీటితో ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ప్రమాదకర స్థితిలో చెరువులు చేరుతున్నాయి. రానున్న రోజుల్లో చెరువుల్లో నీరు లేక భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో మళ్లీ నీటి కరువు వస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Cc