నల్లగొండ రూరల్, ఏప్రిల్ 13 : ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు, మండల్ కమిషన్ చైర్మన్ బిందేశ్వరి ప్రసాద్ మండల్ వర్ధంతిని నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా యాదవ ఉద్యోగుల సంఘం, బి.పి. మండల్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపారు. మున్సిపల్ కార్పోరేటర్ అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి సుభాష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కేంద్రంలోని బి.పి. మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
బీపీ మండల్ వర్ధంతిని పునస్కరించుకొని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి సుభాష్ యాదవ్ మాట్లాడుతూ బి.పి. మండల్ భారతదేశంలో సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుభావుడని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అపారమైనదని అన్నారు. ఆయన అధ్యక్షతన ఏర్పడిన మండల్ కమిషన్ నివేదిక దేశ రాజకీయ, సామాజిక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు కావడానికి ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని తెలిపారు.
ఓబీసీలు విద్య, ఆర్థిక, సామాజిక, ఆర్థిక రంగాలలో అభివృద్ధి చెందడానికి మండల్ కమిషన్ సూచనలు ఇచ్చిందని అల్లి సుభాష్ యాదవ్ వెల్లడించారు. మండల్ కమిషన్ నివేదికలోని అన్ని అంశాలను అమలు చేసినప్పుడే ఓబీసీలు సామాజికంగా అభివృద్ధి చెందుతారని ఆయన అన్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి కులగణనను నిర్వహించడానికి ఆయన సూచనలే మార్గదర్శకమని, సామాజిక సమానత్వం కోసం ఆయన చూపిన మార్గం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. కష్టపడి చదవడం, సామాజిక బాధ్యతతో ముందుకు సాగడం, అణగారిన వర్గాల కోసం కట్టుబడి పనిచేయడం వంటి విలువలను ఆయన జీవితం మనకు నేర్పుతుందని అల్లి సుభాష్ యాదవ్ అన్నారు. బి.పి. మండల్ ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమాజంలో సమానత్వం, న్యాయం నెలకొల్పడానికి ఆయన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
బీపీ మండల్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రతి సంవత్సరం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అల్లి సుభాష్ యాదవ్ కోరారు. ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు, విగ్రహ కమిటీ సభ్యులు తరాల పరమేశ్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్వీ యాదవ్, వోలి సమీర్ కుమార్, గుండెబోయిన జానయ్య యాదవ్, దొంగరి యాదగిరి, దుడుకు లక్ష్మీనారాయణ, మునాసు ప్రసన్న, పుట్ట వెంకన్న, జనార్దన్, గొడ్డేటి నర్సింహ యాదవ్, చిట్టబోయిన లింగయ్య యాదవ్, బత్తుల నాగార్జున్, అల్లి సతీష్ యాదవ్, నల్లబోతు సురేష్, దగ్గు రవి, సుంకరబోయిన శివకుమార్, వివిధ బీసీ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాపని వెంకటరమణ, గడ్డం శ్రీనివాస్, రాందాసు, బెల్లి కృష్ణమూర్తి, బీసీ సంఘాల నాయకులు, ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై బీపీ మండల్ సేవలను స్మరించుకున్నారు.