యాదగిరిగుట్ట, జూన్10 : యాదగిరిగుట్ట నారసింహ స్వామి ప్రధానాలయం శనివారం భక్తులతో సందడిగా మారింది. స్వయంభూ నారసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మాఢ వీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢ వీధులు, గర్భాలయ ముఖ మండపంలోని క్యూలైన్లు భక్తుల సందడిగా మారాయి. ప్రసాద విక్రయశాల వద్ద కోలాహలం నెలకొన్నది. తెల్లవారుజాము నుంచే స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు జరిగే సువర్ణపుష్పార్చన, వేద ఆశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. స్వామి, అమ్మవార్ల నిత్యతిరు కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి సుదర్శన నారసింహ హోమం వైభవంగా జరిగింది.
ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామివారి సహస్రనామార్చన చేపట్టారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలను వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామివారిని సుమారు 38 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ. 54,98,646 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్నప్రముఖులు..
లక్ష్మీనరసింహస్వామిని ఐఏఎస్ విజయేంద్రజోషి, సీఐడీ ఎస్పీ గంగారాం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి అర్చకులు సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేశారు. అధికారులు స్వామివారి ప్రసాదం అందజేశారు.
సామూహిక అక్షరాభ్యాసం..
లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 6వ రోజు కొండకింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేశారు. పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సుమారు 50 మందికి పైగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొని చిన్నారులతో అక్షరాలు రాయించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ ఎన్.గీత, ఏఈఓ గజవెల్లి రమేశ్‌బాబు, గట్టు శ్రవణ్‌కుమార్, ఆలయ అధికారులు దూశెట్టి కృష్ణ, వెంకటేశ్ పాల్గొన్నారు.