యాదగిరిగుట్ట, జనవరి 20 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. నిజరూప దర్శనంలో స్వయంభువులకు దర్శనమిచ్చారు.
స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల పాదాల వద్ద 108 బంగారు పుష్పాలు ఉంచి అష్టోత్తర నామాలు పఠిస్తూ అర్చించారు. అనంతరం స్వామివారికి హారతినిచ్చి భక్తుల గోత్రనామాలు పేరిట సంకల్పం చేశారు. వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిపించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు ఉత్సవమూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ నిర్వహించారు.
అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణతంతు చేపట్టారు. కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. పాతగుట్టలో స్వామివారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 12వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి వారి ఖజానాకు రూ.18,05,129 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 1,42,550
వీఐపీ దర్శనాలు 22,500
బ్రేక్ దర్శనాలు 1,02,300
వేద ఆశీర్వచనం 11,400
నిత్య కైంకర్యాలు 1,800
సుప్రభాతం 900
ప్రచార శాఖ 32,550
వ్రత పూజలు 65,600
కల్యాణకట్ట టిక్కెట్లు 65,000
ప్రసాద విక్రయం 8,76,990
వాహన పూజలు 8,400
అన్నదాన విరాళం 69,291
శాశ్వత పూజలు 10,000
సువర్ణ పుష్పార్చన 59,432
యాదరుషి నిలయం 58,556
పాతగుట్ట నుంచి 17,110
కొండపైకి వాహన ప్రవేశం 2,00,000
శివాలయం 4,800
ఇతర విభాగాలు 55,400
పుష్కరిణి 550