యాదగిరిగుట్ట, జూన్ 2 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభూ నారసింహుడికి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్రం జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల తిరువీధి, దర్బార్ సేవల్లో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలను వైభవంగా నిర్వహించారు. సుదర్శన నారసింహ హోమం జరిపారు. ఉదయం ఆలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ సుదర్శన నారసింహ హవనం నిర్వహించారు.
వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి గజవాహన సేవ చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. సాయంత్రం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ జరిపారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలోని ఊయలతో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో కొనియాడుతూ లాలిపాటలు పాడారు. స్వామివారిని సుమారు 25 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ.34,12,537 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.