యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 15 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధంగా ఉన్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నాలుగు రోజుల పాటు జరిగే అధ్యయనోత్సవాలకు గురువారం అంగరంగ వైభవంగా, పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం ప్రధానార్చక బృందం శ్రీకారం చుట్టింది. ప్రత్యేక సేవపై స్వామి, అమ్మవార్లతో ఆళ్వార్ స్వాములను అలంకరించారు.
ఆలయంలో నిత్య ఆరాధనల అనంతరం తిరుమంజన మహోత్సవాన్ని పాంచరాత్రాగమ సాంప్రదాయ రీతిలో ప్రధానార్చకులు, అర్చకులు, పారాయణికులు, వేద పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు.
సాయంత్రం తొళక్కంతో ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయం మండపంలో సేవకు అర్చకులు, పారాయణికులు, రుత్వికులు వేద పారాయణాలను ఆలపించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ రామకృష్ణారావు, ఉప, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో మూలవర్యులకు ఆగమశాస్ర్తానుసారంగా తిరుమంజన మహోత్సవం నిర్వహిస్తారు. భగవత్ రామానుజులవారు ఈ వేడుకలను నిర్వహించ డంలోని ప్రత్యేకతను సూచిస్తూ భగవానుడి భక్త పరాయణతను ఆర్తత్రాణ రక్షణను పలు విధాలుగా ప్రస్తుతిస్తారు. తిరుమంజన మహోత్సవంలో ఆళ్వారులకు, భగవానుడికి ఉత్సవ మూలవర్యులకు స్నపనం నిర్వహిస్తారు. ఈ వేడుక స్వామివారికి పరమ ప్రీతికరమైనది అని దివ్యదేశికవైభవ ప్రకాశికలో పేర్కొన్నారు.
యాదగిరిగుట్ట ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. గురువారం తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వయంభూ నరసింహస్వామిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహులు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల పాదాల వద్ద 108 బంగారు పుష్పాలు ఉంచి అష్టోత్తర నామాలు పఠిస్తూ అర్చించారు. అనంతరం స్వామివారికి హారతినిచ్చి భక్తుల గోత్రనామాల పేరిట సంకల్పం చేశారు.
వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవను జరిపారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణతంతు చేపట్టారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణ తంతును జరిపారు.
ప్రధానాలయంలో సాయంత్రం వేళ స్వామివారికి తిరువీధిసేవ, దర్భార్సేవ అత్యంత వైభవంగా చేపట్టారు. రాత్రివేళ స్వామివారికి తిరువారాధన చేపట్టి, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు అత్యంత వైభవంగా సాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 10వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.20,88,675 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు రథసప్తమి వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 6:40 గంటలకు స్వామివారిని సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేసి తిరు మాఢవీధుల్లో ఊరేగించనున్నారు. సాయంత్రం 7గంటలకు స్వామివారిని బంగారు రథంపై ఊరేగిస్తారు.