శాలిగౌరారం, సెఫ్టెంబర్ 10 : అసలే పేదరికం.. ఆపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతిని మంచానికే పరిమితమయ్యాడు. నెల కాదు..రెండు నెలలు కాదు మూడేళ్లుగా మంచానికే పరిమితమై జీవచ్ఛవంలా పడి ఉన్నాడు. కట్టుకున్న భార్యే అన్నీ తానై కన్నతల్లిలా సాకుతూ సేవ చేస్తోంది. ఈ హృదయ విదారకర సంఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని మనిమద్దె గ్రామానికి చెందిన రావుల యాదగిరిది(55). యాదగిరిది నిరుపేద కుటుంబం. భార్య కిష్టమ్మతో పాటు నలుగురు సంతానం అతని మీదనే ఆధారపడి జీవించే వారు.
విధి వక్రీకరించడంతో మూడేండ్ల క్రితం తన బైక్పై నార్కట్పల్లి మండలం అమ్మనబోలుకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి, రెండు కాళ్లు, చేతులు చచ్చుపడటంతో మంచం పట్టాడు. అప్పటినుంచి నేటి వరకు యాదగిరి మంచానికే పరిమితమయ్యాడు. భార్య కిష్టమ్మ ఆయనకు అన్ని సేవలు చేస్తూ, అన్నం తినిపిస్తూ అష్టకష్టాలు పడుతోంది. కూలిపనికి వెళ్లి వచ్చిన డబ్బుతో భర్తను పోషిస్తూ వస్తోంది. నలుగురు సంతానంలో ముగ్గురికి వివాహమైనట్లు తెలిపారు. ఉండేందుకు ఇల్లు కూడా సరిగ్గా లేదు రేకుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. అపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లయినా ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పింఛన్ ఇప్పించాలి..
యాదగిరి మంచానికే పరిమితం కావడంతో బయటకు వెళ్లేలేని పరిస్థితి. కనీసం సదరం క్యాంపునకు కూడా వెళ్లలేని దుస్థితి. సంబంధిత అధికారులు మానవతాదృక్పథంతో ఆలోచించి యాదగిరి ఇంటికే వచ్చి పరీక్షలు నిర్వహించి సదరం క్యాంపు సర్టిఫికెట్ వచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు.