– పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ
భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 21 : పాలకుల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా హక్కుల సాధన కోసం యువత సమిష్టిగా ఉద్యమించాలని ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని రమాదేవి ఫంక్షన్ హాల్లో పి వై ఎల్ యాదాద్రి భువనగిరి జిల్లా 9వ మహాసభ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మారు జోడి సిద్దేశ్వర్ బిగిపిడికిలి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి పాలకులు యువతను చైతన్యవంతులుగా తీర్చిదిద్దాల్సింది పోయి మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాల ఊబిలోకి నెట్టి తమ అధికారాన్ని కాపాడుకుంటున్నారని విమర్శించారు. యువత ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయేలా చేసి, మత్తులో ముంచి పాలన సాగించడం పాలకుల కుట్రలో భాగమే అన్నారు., నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా కేవలం ఎన్నికల సమయంలో దొంగ హామీలతో యువతను మోసం చేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, నోటిఫికేషన్ల జాప్యంతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలకుల తప్పుడు వాగ్దానాలను నిలదీయాలనీ కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, తమ హక్కుల కోసం క్షేత్రస్థాయిలో ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి రావాలని, రాజకీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని, ప్రశ్నించే గొంతుకగా మారాలన్నారు. దేశ ప్రగతి యువత శ్రమశక్తి పైనే ఆధారపడి ఉందని గుర్తించి, వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్ కోసం సిద్ధం కావాలన్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రగతిశీల యువజన సంఘం (PYL) నిరంతరం రాజీలేని పోరాటం చేస్తోందని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, యువతను పట్టిపీడిస్తున్న మత్తు పదార్థాలను అరికట్టాలని, ఉచిత వైద్యం, ఉపాధిని ప్రాథమిక హక్కుగా గుర్తించాలని పేర్కొన్నారు.
ఈ మహాసభల్లో ఏ.ఐ.కె.ఎం.ఎస్.రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి, ఇఫ్టూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.జనార్దన్, పి.వై.ఎల్. రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమార్, కోశాధికారి డి.రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి సాదుల శ్రీకాంత్, కోశాధికారి పగడాల శివ, పి.డి.ఎస్.యూ.జిల్లా కార్యదర్శి ఆర్.ఉదయ్, ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు జి.నాగరాజు, గోరుగంటి ముత్యాలు, బాలకృష్ణ, పోతగాళ్ల నర్సింహ, సర్వన్, వెంకటేష్, మల్లేష్, సుధాకర్, ఆకుల కృష్ణ, శికిలం వెంకటేష్, మామిడాల భాను, గోరుగంటి నవీన్, శ్రీనాథ్, శివ, పాక నవీన్ పాల్గొన్నారు.

‘హక్కుల సాధనకు యువత ఉద్యమించాలి’