యాదగిరిగుట్ట, మార్చి19 : యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి కల్యాణ లక్ష్మీనరసింహ స్వామి దివ్య విమాన రథంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల పుష్పాలు, మామిడి, అరటి తోరణాలతో దివ్య విమాన రథాన్ని శోభాయమానంగా అలంకరించి, విశ్వక్సేనుడికి తొలి పూజతో రథోత్సవాన్ని అరంభించారు. పట్టువస్ర్తాలు, బంగారు, వెండి, ముత్యాల ఆభరణాలతో కల్యాణ దంపతులైన లక్ష్మీనరసింహ స్వామిని అలంకరించి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ దివ్య విమాన రథంపై ఊరేగించారు. వేద పారాయణాలు, మూలమంత్ర పఠనాలతో రథాంగ హోమం పూజలు చేసి లక్ష్మీనరసింహ స్వామికి హారతి నివేదించారు. భక్తుల జయజయ ధ్వానాలు, మంగళ వాయిద్యాల నడుమ ఏక శిఖరవాసుడిని విహరింపజేసే ఘట్టాలు నేత్రపర్వంగా సాగాయి. స్వామివారి రథోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దివ్య విమాన రథోత్సవాలను దేవస్థాన ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వేంకటాచార్యులు, అర్చకులు, పారాయణికులు ఆగమశాస్త్ర రీతిలో నిర్వహించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. ఉదయం శబరి గిరీశ అయ్యప్ప భక్త బృందం, భాగ్యలక్ష్మి మహిళా భజన మండలి భజన కార్యక్రమాలు, వెంపరాల వెంకటలక్ష్మి, శ్రీనివాసమూర్తి గారి శ్రీమత్ భాగవతాంర్గత నృసింహతత్తం ఉపన్యాసం, శారద భాగవతారిణితో ధృవచరిత్ర హరికతా గానం నిర్వహించారు. సాయంత్రం శారద సంగీత విద్యాలయం వారి భక్తి సంగీత కార్యక్రమం, డాక్టర్ మోహన కృష్ణ గారి కర్ణాటక సంగీతం, కుమారి వైష్ణవి గోపాల్ గారి వీణావాద్యం, కుమారి విశ్వజ, విష్ణుజ వారి కూచిపూడి నృత్య ప్రదర్శన, సమతుల్య యోగా కూచిపూడి డ్యాన్స్, ఆర్వీఎస్ఎన్వీ సోమయాజులు, వేదాంతం కూచిపూడి డ్యాన్స్ అకాడమీ, భరద్వాజ నాట్యాలయం, డాక్టర్ నవ్య నాగబండి, నాట్య మయూరి డ్యాన్స్ అకాడమీ వారి కూచిపూడి నృత్య పదర్శన, గడ్డం సుదర్శన్ చిందు యజ్ఞగానం కార్యక్రమాలు అలరించారు.
విష్ణుమూర్తి అలంకారంలో..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణ వేడుకలతో లక్ష్మీనాథుడైన నరసింహ స్వామి విష్టుమూర్తి అలంకారంలో తన ఇష్ట వాహనమైన గరుత్మంతుడిపై ఆలయ తిరువీధుల్లో ఊరేగారు. అలంకార శోభితుడు లక్ష్మీనరసింహ స్వామిని వేద స్వరూపుడైన గరుడ వాహనంపై అధిష్టింప జేసి, మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ సేవోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవ కల్యాణ నరసింహ స్వామి సన్నిధిలో నిత్యహవనం, వేద పారాయణాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి భాస్కర్‌రావు, డీఈఓ దోర్బల భాస్కర్ శర్మ, యాజ్ఞాచార్యులు కిరణ్‌కుమారాచార్యులు, ముఖ్య అర్చకులు మంగళగిరి నరసింహ మూర్తి, ఉప ప్రధానార్చకులు సురేంద్రాచార్యులు, భాస్కరాచార్యులు, మాధవాచార్యులు, సహాయ కార్యనిర్వహణాధికారి గజవెల్లి రమేశ్‌బాబు, రఘు, గట్టు శ్రవణ్‌కుమార్, పర్యవేక్షకులు సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
నేడు చక్రతీర్థం
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం 7 గంటలకు శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం నిర్వహించనున్నారు. కొండపైన ప్రత్యేకంగా నిర్మించిన విష్ణు పుష్కరిణిలో చక్రస్నానం జరిపించనున్నారు. అనంతరం భక్తులకు పుణ్యస్నానాలకు అనుమతినివ్వనున్నారు.