యాదగిరిగుట్ట, మార్చి 8 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం శనివారం రాత్రి పాంచరాత్రగమ శాస్త్రరీతిలో వైభవంగా జరిగింది. లక్ష్మీనరసింహుడిని గజ వాహనంపై, అమ్మవారిని పూల పల్లకిలో కల్యాణ వేదికకు తీసుకువచ్చారు. రాత్రి 8.45 గంటలకు స్వయంభూ ప్రధానాలయం ఉత్తర మాఢవీధుల్లో నెలకొల్పిన ప్రత్యేక వేదికపై వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణ తంతు నిర్వహించారు.
యాదగిరిగుట్ట నరసింహస్వామి లోక కల్యాణార్ధం సముద్ర తనయ మహాలక్ష్మీ అమ్మవారి మెడలో రాత్రి 10.47 గంటలకు తుల లగ్న సుమూర్తంలో మాంగళ్యధారణ చేశారు. కల్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టువస్ర్తాలను ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ కిరణ్ కుమార్రెడ్డి, ఆలయం తరపున ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో భాస్కర్రావు సమర్పించారు. కల్యాణ మహోత్సవాన్ని ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వేంకటాచార్యులు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం నరసింహస్వామిని శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై తిరుమాఢవీధుల్లో ఊరేగించారు.
మంత్రుల గైర్హాజరు..
తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరపున మంత్రులు హాజరై పట్టు వస్ర్తాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. కాగా, ఈసారి కల్యాణోత్సవానికి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి గానీ, ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులు గానీ హాజరు కాలేదు.
నేడు దివ్య విమాన రథోత్సవం
ఆదివారం ఉదయం 9గంటలకు మహావిష్ణు ఆలంకారంలో గరుఢ వాహనంపై లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 8గంటలకు దివ్య విమాన రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. తిరుమాఢవీధుల్లో స్వామివారి ర థంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.