యాదగిరిగుట్ట, జనవరి31: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి అనుబంధమైన పాతగుట్ట ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్యులకు నిజాభిషేకం, విష్వక్సేనారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వస్తివాచనం వంటి వైదృశ్య కార్యక్రమాలతో ఉత్సవాలకు మంగళవారం ఆలయ అర్చకులు, అధికారులు శ్రీకారం చుట్టారు.
ఉదయం 9 గంటలకు స్వస్తివాచన ఘట్టాన్ని చేపట్టారు. సకల దేవకోటిని ఉత్సవాలకు విచ్చేసి సర్వలోకాలకు క్షేమాన్ని కలిగించాలని వేడుకోవడమే స్వస్తివాచనం అని అర్చకులు తెలిపారు. పారాయణికులతో మూలమంత్ర, భాగవత, రామాయణ, వేదప్రబంధ పారాయణాలు గావించారు. 33 కోట్ల దేవతలు, పద్నాలుగు లోకాలు, సమస్తప్రాణికోటి, చరాచర జగత్తు అంతా భగవానుడి కటాక్షంతో శుభాలు పొందాలని స్వస్తివాచన మంత్రాలతో విష్వక్సేన ఆరాధనతో ప్రార్థించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయం ఆధ్యాత్మికతను సంతకరించుకుంది. ఆలయాన్ని విశేష పుష్పాలంకరణతో ముస్తాబు చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్ల విగ్రహాలకు ఆలయం ముఖ మండపంలో ప్రత్యేక పీఠంపై అధిష్ఠించి పూజలు చేశారు.
రక్షా బంధనం.. పుణ్యాహవాచనం
పాతగుట్ట బ్రహ్మోత్సవంలో శ్రీవారికి, ఉత్సవ నిర్వాహకులకు రక్షాబంధనం కార్యక్రమాన్ని చేపట్టారు. పారాయణికులు, రుత్వికులకు ఆలయ ఈఓ ఎన్. గీత దీక్షా వస్ర్తాలను అందజేశారు. జగద్రక్షకుడైన పరమాత్రమను మూలవరులకు, ఉత్సవమూర్తులకు ఆగమశాస్ర్తానుసారం రక్షాబంధన వేడుకలు నిర్వహించారు. అత్యంత పవిత్రమైన ఉత్సవాల్లో కల్యాణ సంబురాలు, స్థల, ద్రవ్య శుద్ధ్యర్థం పూజించిన జలాలతో శుద్ధి పుణ్యాహవాచన కైంకర్యం చేపట్టారు. అర్చకులు ఆలయ పరిసరాలను శుద్ధి చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచామృత కలశాలకు వేదమంత్రాలతో దర్బలతో పూజలు నిర్వహించి పుణ్యజలంగా సంప్రోక్షణ జరిపారు. తిరువీధుల్లో వేదసూక్త మంత్ర పఠనాలతో తీర్థ ప్రోక్షణ చేశారు. మంత్ర జలాలను మూలవరులకు, ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రోక్షణ గావించారు.
నేటి కార్యక్రమాలు
పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం, వేదపారాయణం, సాయంత్రం 6 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం నిర్వహించనున్నారు.
అంకురారోపణం.. మృత్సంగ్రహణం..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం 6 గంటలకు స్వామివారి ఆలయంలో అంకురారోపణ, మృత్సంగ్రహణంవేడుకలను ఆగమ శాస్త్రరీతిలో చేపట్టారు. తొలిపూజకు ఆలయ ఈఓ గీత, డీఈఓ దోర్బాల భాస్కర్శర్మ హాజరుకాగా ఉత్సవాల్లో ఆలయ ప్రధానార్చకుడు మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకుడు మాధవాచార్యులు, ముఖ్య అర్చకుడు భాస్కరాచార్యులు, అర్చకులు నరేశాచార్యులు, సంపతాచార్యులు, సత్యనారాయణాచార్యులు, పరిచారకులు వినయ్కుమారాచార్యులు, ఫణికుమారాచార్యులు, వేద పండితులు ఫణికుమారశర్మ, పవన్కుమారాచార్యులు, వినయ్కుమారాచార్యులు, పారాయణికులు పాల్గొన్నారు.