యాదాద్రి, నవంబర్ 24 : ఆలేరు రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణంలో ఇండ్లు, షాపులు కోల్పోయిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. బాధితులకు రావాల్సిన నష్ట పరిహారాన్ని రాష్ట్ర ఖజానా నుంచే వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేసింది. 78 మంది బాధితుల ఖాతాల్లో రూ.5.30 కోట్ల నిధులు జమ అయ్యాయి. నియోజకవర్గ కేంద్రమైన ఆలేరు పట్టణంలో పాత ఆలేరుతో పాటు కొలనుపాక, సిద్దిపేట, జనగామ జిల్లాలకు వెళ్లేందుకు రైల్వే ట్రాక్‌ను దాటాల్సి వచ్చేది. దీంతో రైళ్లు వచ్చే వేళల్లో గేట్ వేస్తుండడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. దీంతో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం, ప్రభుత్వ విప్ ప్రత్యేక చొరవతో సికింద్రాబాద్-కాజీపేట సెక్షన్లో ఆలేరు వద్ద రైల్వే గేట్‌కు ప్రత్యామ్నాయంగా రైల్వే అండర్‌పాస్ నిర్మాణాలు 2019 అక్టోబర్ 19న చేపట్టారు.
ఇందుకు కావాల్సిన స్థలం సేకరించేందుకు రైల్వే పక్కనే ఉన్న ఇండ్లు, షాపులను తొలగించి భూ సేకరణ చేయాల్సి వచ్చింది. మొత్తం 78 ఇండ్లు, షాపులు కోల్పోగా బాధితులకు తాజాగా నష్టపరిహారం ఖాతాలో జమ అయింది. ప్రభుత్వం ధర చదరపు అడుగుకు రూ.1,200 ఉండగా, మూడు రెట్లు పెంచి చదరపు అడుగుకు రూ.3,600 చొప్పున ప్రభుత్వం అందజేసిందని ప్రభుత్వ విప్ తెలిపారు. మూడు దఫాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించి నష్ట పరిహారం విడుదల చేసినట్లు చెప్పారు. అండర్ పాస్ రోడ్డు బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు.