యాదాద్రి, ఫిబ్రవరి 6 : యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వారాంతపు సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామి ఆలయ పురవీధులు, లడ్డూ ప్రసాద విక్రయశాల, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. స్వామి వారి ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజామున 4గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో స్వామి వారి ఆరాధనలు ప్రారంభించారు. సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు లక్ష్మీసమేత నారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేపట్టారు. హారతి నివేదనలతో అర్చించి, సుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం చేశారు. నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. శ్రీవారి ఖజానాకు ఆదివారం రూ. 19,68,687 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.