మోటకొండూర్, డిసెంబర్ 21 : రైతుల ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలు మండలంలో పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ సంకల్పంతో రైతులకు భరోసా కల్పించేందుకు 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున వీటిని నిర్మించారు. మండలాన్ని నాలుగు క్లస్టర్లుగా విభజించి మోటకొండూరు, చందేపల్లి, చాడ, మాటూరు గ్రామాల్లో ఒక్కో వేదికను రూ.22 లక్షల వ్యయంతో నిర్మించారు. వీటిని అతి త్వరలోనే ప్రారంభించనున్నారు. వీటి ద్వారా అధికారులు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి సాగుపరంగా సలహాలు, సూచనలు అందించనున్నారు. సాగు పంటలపై ముందుగానే అధికారులతో చర్చించి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సాగు సమస్యకు పరిష్కార మార్గం
రైతు వేదికల ద్వారా రైతులకు సాగులో ఉన్న సందేహాలు తొలగడంతోపాటు సమస్యలు పరిష్కారమవుతాయి. పంటల సాగుపై వ్యవసాయాధికారులు గ్రామస్థాయి నుంచే రైతులకు అవగాహన కల్పిస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తారు. సాగుపై సమగ్ర చర్చకు ఇవి ఎంతగానో తోడ్పడుతాయి.
-ఎగ్గిడి బాలయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్
రైతులకు ఎంతో మేలు
ఆధునిక వ్యవసాయ విధానాలు, ప్రభుత్వ పథకాలను రైతులకు వివరించేందుకు ఈ వేదికలు ఎంతో దోహదపడుతాయి. రైతులు, అధికారులకు చర్చా వేదికలుగా నిలువనున్నాయి. వీటి ద్వారా రైతులకు మంచి రోజులు రానున్నాయి.
-సుబ్బూరి సుజాత, మండల వ్యవసాయాధికారి
రైతులకు మంచి రోజులు..
రైతు వేదిక ద్వారా రైతులకు మంచి రోజులు రానున్నాయి. వ్యవసాయ సేవలు విస్తరించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం వీటి నిర్మాణం చేపట్టింది. మా గ్రామంలో రైతు వేదిక నిర్మాణం కోసం కృషి చేసిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డికి ధన్యవాదాలు.
-మల్గ ఎట్టమ్మ, సర్పంచ్,చాడ గ్రామం