యాదాద్రి : అంగన్వాడీ టీచర్ తమ చిన్నారికి గంటెతో వాతలు పెట్టిందంటూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఆ గాయం తాలుకు బాధతో విలవిల్లాడుతూ ఇంటికి పరుగులు తీసిందంటూ విలపించారు. ఈ సంఘటన యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే యాదాద్రి భువనగిరి జిల్లాలోని పెద్దకందుకూరు గ్రామానికి చెందిన అనుషా, సుదర్శన్‌ల కుమార్తె అభిజ్ఞ(5) ఏడాది నుంచి స్థానికంగా అంగన్వాడీ-1 కేంద్రానికి వెళ్తుంది. బుధవారం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన చిన్నారి అభిజ్ఞ సాయంత్రం ఏడ్చుకుంటూ అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి చేరింది.
తల్లిదండ్రులు పరీక్షించి చూడగా చిన్నారి పెదవులు, చేతులు, చెంపకు కాలిన గాయాలు కనిపించాయి. వెంటనే అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అంగన్వాడీ టీచర్ సునీతను నిలదీయగా మొదటగా బయపెట్టడానికి వాతలు పెట్టానని, ఆ తర్వాత తనకేం పాపం తెలియదని బుకాయించిందని చిన్నారి తల్లిదండ్రులు చెప్పారు. అల్లారుముద్దుగా పెంచుకునే చిన్నారిపై అంగన్వాడీ టీచర్ సునీత కాల్చిన గంటెతో వాతలు పెట్టిందని ఆరోపిస్తూ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జానకిరెడ్డి తెలిపారు.