ఆలేరు టౌన్, ఏప్రిల్ 04 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మితే సహించేది లేదు అని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక రహదారి బంగ్లాలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 16 నెలల కాంగ్రెస్ పాలనలో ఏ రంగం తీసుకున్నా రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు కుదేలవుతుండటం బాధాకరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖపు ఆలోచనలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక చర్యల పట్ల నిరసనలు తెలిపితే అరెస్టులు, నిర్బంధాలు, కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం రేవంత్ రెడ్డి సర్కారుకు అలవాటుగా మారిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధాలతో పాలన కొనసాగించడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమన దిశగా పయనింపజేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో రాత్రికి రాత్రే బుల్డోజర్లను దింపి, పచ్చని చెట్లను కూల్చడమే కాకుండా, అందులో ఉన్న వన్యప్రాణులను కూడా తరిమివేయడం ఎంతో బాధకరమన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ హరితహారం పథకాన్ని ప్రవేశపెట్టి వేలకోట్ల రూపాయలు వెచ్చించి, తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా చేస్తే, నేడు రేవంత్ రెడ్డి ఏది ముట్టుకున్నా బూడిద, నష్టం కలిగించడం తప్పా తెలంగాణ ప్రజలకు చేసింది ఏం లేదని దుయ్యబట్టారు.
కొంతకాలం మూసి ప్రక్షాళన, హైడ్రా, లగచర్ల పేర్లతో కాలయాపన చేస్తూ ప్రజలకు పాలన అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. హెచ్సీయూ భూముల్లో పని ఆపాలని సుప్రీంకోర్టు స్టే విధిస్తే, విద్యార్థులు సంబరాలు చేసుకుంటుంటే అందులో గుంట నక్కలు ఉన్నాయి అని రేవంత్ రెడ్డి చెప్పడం ఆయన పరిపాలనకు పరాకాష్టగా నిదర్శనంగా నిలుస్తుందన్నారు. దేశంలో అద్వాన పాలన కొనసాగుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలన అన్నారు. చరిత్ర హీనుడిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతారన్నారు. హెచ్సీయూ భూముల జోలికి వచ్చినా, భూములను అమ్మినా ఊరుకునే ప్రసక్తే లేదని, బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. వివిధ సంఘాల ఆలోచనలను, మేధావుల ఆలోచనలను పరిగణలోకి తీసుకోకుండా మూర్ఖంగా పాలనను కొనసాగించడం రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. బీఆర్ఎస్ను టార్గెట్ చేయడమే తప్పా, రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందిద్దామన్న సోయిలేని ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండటం, ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం అన్నారు.
కేసీఆర్, కేటీఆర్లపై అసత్య ప్రచారాలు చేస్తూ ఫోన్ ట్యాపింగ్ కానీ, ఫార్ములా ఈ రేస్ కార్లు, కాళేశ్వరం తదితర వాటిపైన ఈడీ విచారణ వరకు తీసుకెళ్లగలిగినా సత్య నిరూపణ చేయలేక, అసత్య ప్రచారంగానే మిగిలిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం గౌడ్, పట్టణ మాజీ అధ్యక్షుడు మొరిగాడి వెంకటేశ్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కొలుపుల హరినాథ్, ఆడెపు బాలస్వామి, బేతి రాములు, బింగి రవి, మాజీ సర్పంచ్ ఏసి రెడ్డి మహేందర్ రెడ్డి, పాషికంటి, రచ్చ రామ్ నరసయ్య, శ్రీనివాస్, చిమ్మి శివమల్లు, కటకం బాలరాజు, బాసాని ప్రశాంత్ పాల్గొన్నారు.