రామన్నపేట, జులై 02 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అవినీతిని సహించేది లేదని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంతో పాటు ఉత్తటూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా రెండో స్థానంలో ఉందన్నారు. లబ్దిదారులకు ఇంటి నిర్మాణ పనుల్లో ఇబ్బందులు కలగకుండా మండల స్థాయిలో ఎంపీడీఓ, తాసీల్దార్, ఎస్ఐలతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
మార్కెట్ ధర కన్న తక్కువ ధరలకు సిమెంట్, ఇటుక, సీకు, ఇతర వస్తువులను ఇప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఇబ్బందులు లేకుండా పనులు అయ్యేకొద్ది ప్రతి సోమవారం ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి విడుదల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతాయని పేర్కొన్నారు. ఆయన వెంట తాసీల్దార్ లాల్బహదూర్శాస్త్రీ, ఎంపీడీఓ యాకూబ్నాయక్, పీఆర్ఏఈ గాలయ్య ఉన్నారు.