బీబీనగర్, జూన్ 05 : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీబీనగర్ మండలం రాఘవాపురం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సిద్ధగోని శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత, గ్రామ పరిశుభ్రత, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, సహజ వనరుల సంరక్షణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, భూగర్భ జలాల తగ్గుదల వంటి సమస్యలను అధిగమించాలంటే విస్తృత స్థాయిలో మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ పర్యావరణ రహిత వస్తువులను ఉపయోగించాలని గ్రామస్థులకు సూచించారు. గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ప్రతి కుటుంబం స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా నిర్వహించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సిలివేరు కవిత మహేష్, వార్డు సభ్యులు తోరుపునూరి రవి, జక్కి నగేష్, పొట్ట మంగమ్మ, గుంటిమిది విజయలక్ష్మి, పంచాయతి కార్యదర్శి కవిత పాల్గొన్నారు.