చౌటుప్పల్, సెప్టెంబర్ 25 : ఈ నెల 27న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎదుట నిర్వహించే ట్రిపుల్ ఆర్ బాధితుల ధర్నాను విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బూర్గు కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం చౌటుప్పల్ మండలం కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు అధ్యక్షతన చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండల కార్యదర్శివర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలైన్మెంట్ రూట్ మ్యాప్ సర్వే నంబర్లతో సహా ఇవ్వడం మూలంగా సంబంధిత రైతులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే అనేక రూపాల్లో రాస్తారోకోలు, ఎమ్మార్వో, ఆర్డీఓ కార్యాలయ ముట్టడి సైతం చేశారని గుర్తు చేశారు. అంతేగాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గరికి వెళ్లినా ప్రయోజనం కనిపించ లేదని మండిపడ్డారు.
భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఒకటి రెండు ఎకరాల నిరుపేద రైతులేనన్నారు. ఈ భూములను సాగు చేసుకుంటేనే వారికి పూట గడుస్తుందన్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకు భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున తరలిరావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు గుంటోజు శ్రీనివాసాచారి, దోడ యాదిరెడ్డి, దోనూరు నర్సిరెడ్డి, సురుకంటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, చింతకాయల నరసింహ, ఐతరాజు గాలయ్య, ఆదిమూలం నందీశ్వర్, బోయ యాదయ్య పాల్గొన్నారు.