ఆలేరు టౌన్, ఆగస్టు 05 : అమెరికాతో వాణిజ్య ఒప్పందం మూలంగా భారత రైతాంగం, వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని, తక్షణమే ఈ ఒప్పందాలను రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కల్లెపు అడివయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చ (ఎస్ కే ఎం) పిలుపు మేరకు ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆలేరు రైల్వే గేట్ ఐఎఫ్టీయూ కార్యాలయంలో ప్రజా సంఘాల సమావేశం ఏఐకేఎంఎస్ జిల్లా గౌరవాధ్యక్షుడు మామిడాల సోమయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా అడివయ్య మాట్లాడుతూ.. గతంలో గాట్, డెంకెల్, డబ్ల్యూటీఓ ఒప్పందాల వలనే ఈ ఒప్పందాలతో వ్యవసాయ రంగం తీవ్ర ప్రమాదంలో పడుతుందన్నారు. అమెరికాతో ఒప్పందం అనేది కార్పోరేట్ కంపెనీలకు లాభాలు చేకూరుతాయే తప్పా, రైతాంగానికి, ఈ దేశానికి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పైగా వ్యవసాయ రంగం తీవ్రంగా బలహీనపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆర్.జనార్ధన్, ఇక్కిరి సహదేవ్, ఆర్.సీత, పద్మశ్రీ సుదర్శన్, గడ్డం నాగరాజు, మారుజోడు సిద్దేశ్వర్, గడ్డం మంకయ్య, చిరబోయిన కొమురయ్య, పంజాల మురళి, ఆర్.ఉదయ్, నల్ల నర్సింగరావు పాల్గొన్నారు.