మోత్కూరు, సెప్టెంబర్ 19 : మోత్కూరు సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు పదవీ వ్యామోహంతో సంఘాన్ని పూర్తిగా దివాళా తీయిస్తున్నాడని సింగిల్ విండో మాజీ చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మోత్కూరులో విలేకరులతో ఆయన మాట్లాడారు. సంఘం కార్యకలాపాలపై ఈ నెల 19న సమావేశం నిర్వహిస్తున్నట్టు డైరెక్టర్లందరితో పాటు తనకు కూడా నోటీసు వచ్చిందని, దాంతో తాను శుక్రవారం సమావేశానికి వచ్చినట్లు తెలిపారు. ఉదయం 11 గంటల సమావేశం నిర్వహించాల్సి ఉండగా చైర్మన్ వెంకటేశ్వర్లు మధ్యాహ్నం 12.45 గంటలకు వచ్చి సమావేశం పెట్టి మిగతా డైరెక్టర్లతో మినిట్స్ బుక్, రికార్డుల్లో సంతకాలు తీసుకుని తనను సంతకం చేయనివ్వలేదని, రికార్డులు బీరువాలో దాచుకుని వెళ్లిపోయాడని తెలిపారు. సంఘం కార్యకలాపాలు, రైతుల సమస్యలు, యూరియా అంశాలపై చర్చించకుండా ఎలా వెళ్లిపోతారని ప్రశ్నిస్తే, గత జనవరిలోనే నిన్ను సస్పెండ్ చేసినట్లు చైర్మన్ చెబుతున్నాడని, అలాంటప్పుడు తనతో సహా చైర్మన్, 13 మంది డైరెక్టర్ల పదవీకాలం పొడిగిస్తూ ఈ నెల 3న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ప్రభుత్వ ఉత్తర్వులు లెక్కలేదా అని ప్రశ్నించారు.
ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మాటేమిటని ప్రశ్నిస్తే తనకు సంబంధం లేదని డీసీఓను అడగమంటున్నాడని, చైర్మన్ మతితప్పి పిచ్చోడిలా మాట్లాడుతున్నాడన్నారు. తన లోపాలు, అరాచకాలు, అవినీతి బాగోతం బయట పడుతుందనే సమావేశం పెట్టకుండా పారిపోయాడన్నారు. ఏడాది కాలంలో సంఘం నుంచి రూ.30 లక్షల రుణాలిచ్చారని, చిరు వ్యాపారులకు ఇవ్వాల్సిన రుణాలను ఎలాంటి వ్యాపారం లేని పార్టీ కార్యకర్తలకు ఇచ్చారని, నెలవారీ వాయిదాల రూపంలో చెల్లించాల్సిన ఈ రుణాలను రికవరీ చేయడం లేదన్నారు. సంఘం రూల్స్ ప్రకారం సంఘంలో సభ్యులుగా ఉన్నవారి షూరిటీతో రుణాలు ఇవ్వాల్సి ఉండగా ఎలాంటి షూరిటీ లేకుండా ఇష్టానుసారంగా రుణాలిచ్చారని, వాటికి ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. ఒక్క పొడిచేడు గ్రామంలోనే చైర్మన్ వెంకటేశ్వర్లు, ఆయన కుటుంబ సభ్యుల షూరిటీతో రూ.5 లక్షల రుణాలిప్పించారని, నేటికీ వాటిని ఎందుకు వసూలు చేయడం లేదో చెప్పాలన్నారు.
తాను చైర్మన్‌గా ఉన్న సమయంలో డైరెక్టర్ల తీర్మానంతో రూ.58 లక్షలతో ప్రస్తుతం ఉన్న కొత్త గోదాం, షాపింగ్ కాంప్లెక్స్ కట్టామని, అందులో లక్షల రూపాయల అవినీతి జరిగిందని నోటికొచ్చిన ఆరోపణలు చేశారని, నేటికీ రూపాయి అవినీతి జరిగినట్టు నిరూపించలేకపోయిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. గోదాం, షాపింగ్ కాంప్లెక్స్‌కు రూ.58 లక్షలు ఖర్చవుతాయా అని ప్రశ్నించిన చైర్మన్ వెంకటేశ్వర్లు బాత్రూం కట్టడానికి రూ.12 లక్షలు ఎలా ఖర్చు చేశారో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడే రైతులకు యూరియా తిప్పలు ఎందుకొచ్చాయన్నారు. 50 లోడ్ల యూరియా నిల్వ చేసే కెపాసిటీ ఉన్న గోదాంలు ఉన్నాయని, అలాంటప్పుడు ముందస్తుగా స్టాక్ ఎందుకు పెట్టలేదని, పదవిపై వ్యామోహం తప్ప రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి, ప్రేమ లేదని విమర్శించారు. సంఘంలో నిధులు నిల్వ లేకుండా పూర్తిగా దివాళా తీయించాడని, చైర్మన్ బాధ్యతా రాహిత్యంతోనే రైతులకు యూరియా కష్టాలు వచ్చాయని, సంఘానికి పాలడుగు గ్రామంలో ఉన్న భవనాన్ని అమ్మాలన్న దురాలోచన చేస్తున్నాడని తెలిపారు.
అప్పటి చైర్మన్ రామకృష్ణారెడ్డి పీరియడ్‌లో రైతులకు తక్కువ రేటుకు డీజిల్ అందాలన్న లక్ష్యంతో దత్తప్పగూడెంలో సంఘం ఆధ్వర్యంలో సంఘం తీర్మానంతో రూ.14 లక్షలతో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారని, కన్జూమర్ నుంచి సర్వీస్ బంక్‌గా మార్చేందుకు ఎన్సీడీసీతో పాటు ఇతర అన్ని అనుమతులు తెస్తే ఏడాదికాలంగా బంక్‌ను ఎందుకు ఓపెన్ చేయడం లేదని, అద్దె చెల్లించడం లేదని స్థలం యజమాని నోటీసులు పంపారని తెలిపారు. పదవీ వ్యామోహంతో చైర్మన్ సంఘాన్ని మరింతగా దివాళా తీయించే పరిస్థితులు ఏర్పడ్డాయని, సంఘం మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. చైర్మన్‌గా వెంకటేశ్వర్లు పదవి చేపట్టిన నాటి నుంచి సంఘం లావాదేవీలు, కార్యకలాపాలు, ఇతర విషయాలన్నింటిపై రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.