చౌటుప్పల్, ఆగస్టు 6: ఉన్నత చదువులు చదివినా మూలలను మరువకుండా కులవృత్తిలో కొత్తదనం కోసం శ్రమించి జాతీయ స్థాయిలో మెరిశాడు ఈ యువ చేనేత కళాకారుడు. సహజ సిద్ధ రంగులు ఉపయోగించి, తక్కువ బరువు, ఎక్కువ డిజైన్లతో చీరె నేసి కేంద్ర పురస్కారానికి ఎంపికయ్యాడు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన కర్నాటి ముఖేశ్ బీటెక్‌లో ఎలక్ట్రానిక్స్ పూర్తి చేశాడు. ఓ వైపు చదువుకుంటూ మరోవైపు కులవృత్తిలో ప్రయోగాలు చేసేవాడు.
చదవు ముగిసినా ఉద్యోగం కోసం వెంపర్లాడకుండా చేనేతనే ప్రధాన వృత్తిగా ఎంచుకుని పదిహేనేండ్లుగా అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే సహజ సిద్ధమైన రంగులతో చీరె నేసి జాతీయ పురస్కారానికి ఎంపికయ్యాడు. చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర, చేనేత జాళి శాఖ జాతీయ స్థాయిలో 14 మందిని కళాకారులను పురస్కారానికి ఎంపిక చేయగా తెలంగాణ నుంచి ముఖేశ్ ఒకరు మాత్రమే ఎంపికయ్యాడు. రాష్ట్రంలో 27 మంది దరఖాస్తు చేసుకోగా ఆయనకు మాత్రమే గుర్తింపు దక్కింది. బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ముఖేశ్ పురస్కారం అందుకోనున్నాడు.
చీరె తయారీ ఇలా…
చీరె తయారీకి ముఖేశ్ సన్నటి నూలు దారం ఉపయోగించాడు. ప్రకృతి సిద్ధమైన రంగులు వాడడంతోపాటు ఆయుర్వేద గుణాలున్న కరక్కాయ పొడి, కుంకుడుకాయ రసంతో శుద్ధ్ధి చేశాడు. ముగ్గంపై పడుగు, పేక ఒక్కో పోగును అల్లుతూ రెండేండ్లు శ్రమించి చీరెను సిద్ధం చేశాడు. 46 అంగుళాల వెడల్పు, ఏడు మీటర్ల పొడవుతో 600 గ్రామాల తేలికైన చీరెను నేశాడు. అందులో పూల మొగ్గలు, విరబూసిన పువ్వులు, సూర్యుడు, చందమామ, స్వస్తిక్, విక్టరీ సింబల్, క్యారమ్ బోర్డు వంటి దాదాపు 100 రకాల డిజైన్లు వేశాడు.
ఇష్టంగా చేస్తేనే ఫలితం
నేను బీటెక్ చేసినా ఉద్యోగావకాశాల కోసం వెతుకలేదు. కులవృత్తిలోనే ప్రత్యేకత చాటాలనుకున్నా. ఉన్న ఊరిలో పది మందికి ఉపాధి చూపించాలనుకున్నా. అందుకోసం చేనేతలోనే కొనసాగుతున్నా. నేటి యువత చేనేత వృత్తిలోకి రావడానికి ఆసక్తి చూపడడం లేదు. ఏ వృత్తినైనా కష్టంతో కాకుండా ఇష్టంగా చేస్తే ఫలితం ఉంటుంది.
-కర్నాటి ముఖేశ్, చేనేత కళాకారుడు