చౌటుప్పల్, మే 15 : వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంప్‌లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య అన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు ఉచితంగా నిర్వహించే వేసవి శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ శిక్షణ కేంద్రాలు విజ్ఞానంతో పాటు వినోదాన్ని పెంపొందించేందుకు దోహదపడుతాయన్నారు. ఆరవ తరగతి నుంచి తొమ్మిది తరగతి పూర్తి చేసుకున్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
ప్రతినిత్యం ఉదయం 8 నుండి 11 గంటల వరకు శిక్షణ కొనసాగనున్నట్లు తెలిపారు. యోగా, స్పోకెన్ ఇంగ్లీష్, లైఫ్ స్కిల్స్, క్యారమ్స్, చెస్, డ్రాయింగ్ తదితర వాటిల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. విద్యార్థి దశలో వీటిని నేర్చుకోవడం ద్వారా భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు దోహద పడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గురువారావు, విద్యా కమిటీ చైర్మన్ ఊదరి పద్మ, హెచ్ఎం డి.భార్గవి, ఉపాధ్యాయులు డి.వెంకటేశ్వరరావు, ఏ.లింగయ్య, ఎం.రమాదేవి, కె.శోభారాణి, జి.శ్రీనివాసులు పాల్గొన్నారు.