Yadagirigutta | యాదగిరిగుట్ట, ఏప్రిల్ 6: యాదగిరిగుట్ట ఆలయ అనుబంధ శ్రీపర్వతవర్ధనీ సమేతరామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీసీతారామచంద్రస్వామివారి కల్యాణోత్సవం కనువిందుగా సాగింది. ఆదివారం ఉదయం ప్రాతఃకాలం, మధ్యాహ్న పూజల అనంతరం సీతారామచంద్రస్వామివారిని దివ్య మనోహరంగా అలంకరించి శివాలయ తిరువీధుల్లో ఊరేగించారు. అనంతరం కల్యాణ మండపంలో వేంచేపు చేసి కల్యాణ క్రతువును ప్రారంభించారు.
మొదటగా విఘ్నేశ్వర సంకల్పం, పూజలు జరిపారు. వేదమంత్ర పూతమైన జలాలతో ఆలయ ప్రాంగణంలో సంప్రోక్షణ గావించారు. స్వామి, అమ్మవార్లకు రక్షాసూత్రధారణ చేసిన శివాలయ ప్రధానార్చకులు వేద ప్రాశస్త్యమైన మంత్రోచ్ఛరణలతో స్వామివారికి యజ్ఞోపవిత్రధారణ తంతు నిర్వహించారు. సీతారామచంద్రుడి పాదప్రక్షాళన చేసిన అనంతరం కన్యాదాన తంతును నిర్వహించారు. వధూవరులు శ్రీరామచంద్రస్వామి, సీతాదేవి అమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ఆలంకరించే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి లోక కల్యాణార్థం జనక మహారాజు తనయ సీతాదేవి అమ్మవారి మెడలో మధ్యాహ్నం ఒంటి గంటకు అభిజిత్ లగ్న సుముహూర్త శుభఘడియలలో మాంగళ్యధారణ చేశారు. కల్యాణ దంపతులపై ముత్యాల తలంబ్రాలను పోశారు. శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణవైభవాన్ని ఆలయ ప్రధానార్చకులు నల్లనఘళ్ లక్ష్మీనరసింహచార్యులు భక్తులకు వివరించారు. అనంతరం చతుర్వేద పారాయణం, ఆశీర్వచనం చేసి స్వామివారి నివేదన, తీర్థప్రసాద వితరణ గావించారు. స్వామివారి కల్యాణతంతుకు చూసి భక్తులు ఆనంద పరవశం పొందారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు దంపతులు, ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈవో భాస్కర్రావు, డీఈవో దోర్బాల భాస్కర్ శర్మ, శివాలయ ప్రధానార్చకులు గౌరీభట్ల నర్సింహ్మరాములు శర్మ, ప్రధాన పురోహితులు గౌరిభట్ల సత్యనారాయణశర్మ, పురోహితులు నాగరాజు శర్మ, శ్రీధర్ శర్మ, శ్రీనివాస శర్మ ఆలయ అర్చకులు, ఏఈవోలు, పర్యవేక్షకులు, అధికారులు పాల్గొన్నారు.