బీబీనగర్, ఆగస్టు 04 : బహుజన వీరుడు పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ మహాసభ జిల్లా అధ్యక్షుడు పిట్టల అశోక్ అన్నారు. ఆగస్టు 8వ తేదీన పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకుని ముదిరాజ్ సంఘం బీబీనగర్ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం వాల్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన బహుజన వీరుడు పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పండుగ సాయన్న కేవలం భౌతిక దోపిడీకి వ్యతిరేకంగా మాత్రమే కాకుండా, సామాజిక న్యాయం కోసం, రాజ్యాధికారంలో బీసీలకు న్యాయమైన వాటా కోసం పోరాటం సాగించినట్లు తెలిపారు.
సాయన్న వారసత్వాన్ని కేవలం జయంతి నాడు గౌరవించడంలో కాదు ఆయన కలలను నిజం చేసే దిశగా బీసీలు, బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలన్నారు. బీసీలు తమ సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కుల కోసం సంఘటితమవాలని, రాజకీయ తలంపుల కోసం కాకుండా, సామాజిక న్యాయ సాధన కోసం పండుగ సాయన్న జయంతిని ఆగస్ట్ 8న గ్రామ గ్రామాన ఘనంగా జరుపుకోవాలనీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కనకబోయిన గోపాల్, కొర్ని పాండు, ఆరుముల్ల జహంగీర్, బోయిన కృష్ణ, సార నరసింహ, గుండెగల్ల అశోక్, ఎర్రోళ్ల బాలరాజు పాల్గొన్నారు.