సంస్థాన్ నారాయణపురం, జూన్ 6: రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదని అసమర్థ పాలన అని సర్పంచ్ల సంఘం రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ (Survi Yadaiah Goud) విమర్శించారు. యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నారాయణపురం మండలంలోని తాజా మాజీ సర్పంచ్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో అప్పులు చేసి మరీ సర్పంచులు అభివృద్ధి పనులు చేశామని మా బిల్లులు చెల్లించమని కోరితే అక్రమంగా అరెస్టులు చేసి కేసులు నమోదు చేస్తున్నారని వాపోయారు.
రేవంత్ రెడ్డి ఏ జిల్లా పర్యటనకు వెళ్తే ఆ జిల్లాలో సర్పంచ్లను మందస్తుగా అరెస్టు చేయడం పరిపాటిగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలకు రూ.153 కోట్లు విడుదల చేస్తున్నామని గొప్పలు చెప్పకూడదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం కాంట్రాక్టర్లకు విడుదల చేసి అవి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అరెస్టు అయిన వారిలో బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ నర్రి నరసింహ, మాజీ సర్పంచులు జక్కర్తి పాపయ్య, దోనూరు శేఖర్ రెడ్డి, యాదవ రెడ్డి, మన్నే చిత్ర చిన్నారెడ్డి, పాండురంగ నాయక్, కట్టెల బిక్షపతి, గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ భిక్షం, సిద్ధగొని శీను ఉన్నారు.