చౌటుప్పల్, సెప్టెంబర్ 12 : రీజినల్ రింగ్ రోడ్డు భూ భాదితులు మరోసారి భగ్గుమన్నారు. అలైన్మెంట్ మార్చాలని, లేదంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బాధిత రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇటీవల భూములు, వివిధ గ్రామాల రైతుల వివరాలను సర్వే నంబర్లతో ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, వలిగొండ తదితర మండలాల్లోని వివిధ గ్రామాల్లో భూములు కోల్పోతున్న వందలాది మంది రైతులు రెండు గంటలకు పైగా ఆర్డీఓ కార్యాలయం ఎదుట బెఠాయించి ధర్నా కొనసాగించారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, వివిధ ప్రజా సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. పోలీసులు సైతం అధిక సంఖ్యలో మోహరించి భారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినా కూడా రైతులు ఆర్డీఓ కార్యాలయం చేరుకుని ధర్నా చేపట్టారు.
పెద్దల కోసం అలైన్మెంట్ మార్చి పేదల పొట్ట గొడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాణాలైనా వదులుకుంటాం గాని భూమిని వదులుకోమని నినాదాలను మిన్నంటించారు. పరిశ్రమ కోసం 40 కిలోమీటర్ల అలైన్మెంట్ను 28 కిలోమీటర్లు కుదించారని ధ్వజమెత్తారు. అనంతరం ఆర్డీఓ శేఖర్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చి స్థానిక బస్టాండ్ వైపు ర్యాలీగా బయల్దేరారు. రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకోకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పసిగట్టి అడ్డుకున్నారు. దీంతో కొంతమేరకు ట్రాఫిక్ స్తంభించింది. ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికటి సత్యం, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పల్లె వెంకట్రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు గంగిడి మనోహర్ రెడ్డి, భూ నిర్వాసితుల కన్వీనర్ చింతల దామోదర రెడ్డి పాల్గొన్నారు.
Choutuppal : చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట రీజినల్ రింగ్ రోడ్ భూ భాదితుల ధర్నా