– వారు వేసిన వేలి ముద్రలను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలి
– రజక కులస్తుల సమిష్టి నిర్ణయంతోనే భూమిని విక్రయించాం
– రూ.కోటి ఇవ్వాలని గడసంతల మల్లేశ్ డిమాండ్ చేసింది వాస్తవమే
– తమపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం
– రజక కులస్తుల వివరణ
యాదగిరిగుట్ట, ఆగష్టు 25: రక్షణ కౌలుదారు హక్కు చట్టం (38 ఈ)లో భాగంగా వారసత్వం కింద సర్వే నంబర్లోని 376లో సంక్రమించిన 41 ఎకరాల భూమిని రజక కులస్తుల సమిష్టి నిర్ణయంతోనే ఓ కంపెనీకి విక్రయించిన మాట వాస్తవమేనని రజక కులస్తులు గడసంతల వెంకటేశ్, కిష్టయ్య, శివరాజు, మల్లయ్య, శ్రీశైలం అన్నారు. ఫోర్జరీ సంతకాలు చేసి విక్రయించామని గడసంతల మల్లేశ్‌తో పాటు ఇతరులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఫోర్జరీ సంతకాలని ఆరోపిస్తున్న వారి వేలిముద్రలను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్ష నిర్వహించి నిజ నిర్ధారణ చేయాలన్నారు. విక్రయించడంతో పాటు కోర్టులో వేసిన దావాలో వారు సంతకాలు చేయలేదని నిరూపిస్తే ఏ శిక్ష వేసిన సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సోమవారం యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురంలో మీడియాతో వారు మాట్లాడారు.
రజక కులస్తుడైన గడసంతల నారాయణ పేరిట 41 ఎకరాల భూమిని రక్షిత కౌలుదారు హక్కు చట్టం కింద హక్కులు సంక్రమించినట్లు తెలిపారు. వారసత్వంగా వస్తున్న భూమి కావడంతో రజక కులస్తుల ఆమోదంతో ఆయనకు వారసులైన గడసంతల కిష్టయ్య, శివరాజ, మల్లయ్య, కొమ్మరాజు యాదగిరి పేరటి రిజిస్ట్రేషన్ చేసి ఓ కంపెనీకి విక్రయించింది వాస్తవమేనన్నారు. ఎకరానికి రూ.1.30 లక్షలు రాగా వారసులందరికీ సమాన బాగస్వామి వాటా కింద పంపిణీ జరిగిందన్నారు. భూముల ధరలు పెరగడంతో 2021లో తమకు సరైన న్యాయం జరుగలేదని, న్యాయం కావాలని కోరుతూ హైకోర్టులో దావా వేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో తమకు సరైన డబ్బులు ఇచ్చేందుకు కొనుగోలు చేసిన కంపెనీ నష్ట పరిహారం ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఈ క్రమంలో అతిగా ఆశపడి కేవలం ఎకరం భూమి కలిగిన గడసంతల మల్లేశ్ తమకు రూ.కోటి కావాలని కంపెనీపై తమకు తెలియకుండానే కోర్టులో కేసు వేసినట్లు తెలిపారు.
దీనిపై తమకు నోటీసులు రాగా కోర్టుకు ఆధారాలు సమర్పించగా గడసంతల మల్లేశ్ వేసిన దావాను కొట్టివేస్తూ 2024 డిసెంబర్ మాసంలో హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. దీంతో మల్లేశ్ తమ వారసుల పేర్లను ఫోర్జరీ సంతకాలు చేశారన్న డ్రామాకు సృష్టించి ఇటీవల పోలీస్ స్టేషన్లో తమపై పిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదుకు స్పందించి వేలిముద్ర సంతకాలు కలిగిన ఆధారాలతో పోలీస్ స్టేషన్‌కు సమర్పించామన్నారు. పోర్టరీ సంతకాలు చేసిన భూములు విక్రయించడంతో పాటు కోర్టులో దావా వేసిన సంగతి నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధమేనని తెలిపారు. దీనిపై న్యాయ పోరాటానికి మల్లాపురం అధిక శాతం రజక కులస్తులు సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో రజక కులస్తులు గదసంతల వెంకటేశ్, కిష్టయ్య, సత్యనారాయణ, ఆంజనేయులు, మల్లేశ్, శ్రీశైలం, కనకరాజు, కొమ్మరాజు యాదగిరి, భరత్ కుమార్, బొడ్డుపల్లి రాజు, నర్సింహులు పాల్గొన్నారు.