యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామానికి చెందిన విద్యార్థులు హైదరాబాద్ గాజులరామారంలో సోమవారం జరిగిన ఇంటర్నేషనల్ పావలిన్ 4వ జాతీయస్థాయి కుంగ్ ఫు కరాటే పోటీలో గోల్డ్, సిల్వర్ మెడల్ సాధించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా లెజెండ్ గ్రాండ్ మాస్టర్ వీరాచారి, డ్రంకెన్ మార్షల్ ఆర్ట్స్ వ్యవస్థాపకుడు వెంకటేశ్ హాజరయ్యారు. ఈ పోటీలో చొల్లేరుకు చెందిన ఆరుగురు విద్యార్థులు కటాస్, స్పారింగ్ విభాగాల్లో అత్యుతమ ప్రతిభ కనబరిచారు.
వీరికి వీరాచారి చేతులమీదుగా మెడల్స్, ప్రశంసా పత్రాలను అందించినట్లు కుంగ్ ఫు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ తొటకూరి బీరయ్య, ఎంపీటీసీ కొక్కలకొండ అరుణలు ప్రత్యేకంగా అభినందించారు.