ఆలేరు టౌన్, ఆగస్టు 21 : ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రిలోని సమస్యలను పరిష్కరించాలని సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి సభ్యుడు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సీపీఎం జిల్లా పోరుబాటలో భాగంగా ఆస్పత్రిలోని సమస్యలపై సర్వే నిర్వహించారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలని ఆస్పత్రి ముందు ధర్నా నిర్వహించారు. రోగులకు మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదన్నారు. అంతా నాసిరకం వంటలే అని, అది కూడా రోగుల సంఖ్యకు సరిపడా ఇవ్వడం లేదన్నారు. ఫ్యాన్లు పని చేయడం లేదని, శానిటేషన్ సైతం సరిగ్గా నిర్వహించడం లేదన్నారు.
ఆస్పత్రిలో ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలని, పూర్తిస్థాయి ఐసీయూ సెంటర్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆలేరు ప్రభుత్వాస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం సమస్యలతో కూడిన మెమోరాండంను ఆస్పత్రికి సిబ్బందికి అందజేశారు. సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అదేవిధంగా డీసీహెచ్ఎస్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మోరిగాడి రమేశ్, తాళ్లపల్లి గణేశ్, బొప్పిడి యాదగిరి, ఘనగాని మల్లేశ్, చెన్న రాజేశ్, ఎండీ ఖలీల్, యాసారపు ప్రసాద్, బర్ల సిద్ధులు, మొరిగాడి లక్ష్మణ్, ఎండీ మతిన్, ఎండీ అఖిల్, ఎండీ యూసుఫ్, జానీ పాల్గొన్నారు.
Aleru : ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రిలోని సమస్యలు పరిష్కరించాలి : కల్లూరి మల్లేశం