యాదగిరిగుట్ట, మార్చి28 : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామంలో గల ప్రీమియర్ ఎక్స్‌ప్లోజీవ్స్ లిమిటెడ్ (పీఈఎల్) కంపెనీ యూనియన్ గుర్తింపు ఎన్నికలు శనివారం జరుగనున్నాయి. గత రెండు వేతన ఒప్పందాల్లో బీఆర్ఎస్ కేవీ చేసిన కృషికి కార్మికుల్లో నమ్మకం పెరగడం, బలమైన కార్మిక సంఘం బీఎంఎస్ సైతం మద్దతుగా నిలవడంతో బీఆర్ఎస్ కేవీకి గెలుపు లాంఛనంగా మారింది. కంపెనీలో మొత్తం 330 కార్మిక ఓటర్లు ఉండగా అందులో బీఆర్ఎస్ కేవీకి 140, బీఎంఎస్‌కు 33 కలిపి 233 మంది కార్మికుల బలంతో బరిలో దిగింది. ఇతర కార్మిక సంఘాల మద్దతుతో సీఐటీయూ సంఘం 157 కే పరిమితమైంది. బీఆర్ఎస్ కేవీ మరో 20 మంది ఇతర కార్మికుల మద్దతుకు ప్రయత్నాలు చేస్తూ సఫలమైంది. దీంతో బీఎంఎస్ బలపర్చిన బీఆర్ఎస్ కేవీ గెలుపు దాదాపుగా ఖరారైంది. శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలు అదే రోజు సాయంత్రం వెలువడనున్నాయి.
బీఆర్ఎస్ కేవీ కార్మిక సంఘం గత రెండు దఫాలుగా గుర్తింపు ఎన్నికల్లో గెలుపొంది కార్మికులకు అండగా నిలిచింది. 10, 11 వేతన ఒప్పందాల్లో బీఆర్ఎస్ఐబీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్ రెడ్డి కంపెనీ యజమాన్యంతో సంప్రదింపులు జరిపి కార్మికులు మెచ్చే వేతన ఒప్పందాలు అమలు చేశారు. 10, 11వ వేతన ఒప్పందాల్లో రూ.11,517 వరకు కార్మికుల జీతభత్యాలను పెంచారు. ట్రైనీ కార్మికులకు రూ.12 వేల వరకు వేతనం, యజమాన్యాన్ని ఒప్పించి జూనియర్ కార్మికులకు అగ్రిమెంట్ వర్తింపచేయడంతో పాటు ఏరియర్స్‌ను సాధించారు. ఫెస్టివల్ అడ్వాన్స్ గతంలో కేవలం రూ.1,500 ఉండగా రూ.8,500 వరకు పెంచేలా బీఆర్ఎస్ కేవీ కార్మిక సంఘం కృషి చేసి సాధించింది.
కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి రూ.35 లక్షల పరిహారంతో పాటు కుటుంబానికి రెండు ఉద్యోగాలను ఇప్పించింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో పెట్టిన లాక్డౌన్ సమయంలోనూ కార్మికులందరికీ 75 శాతం వేతనాన్ని కల్పించింది. 5 మంది కార్మికులను శాశ్వత ఉద్యోగస్తులుగా నియమించేలా కృషి చేసింది. ఇటీవల కంపెనీలో జరిగిన పేలుడు సంఘటనలో మృతి చెందిన కార్మికుడు కనకయ్య కుటుంబానికి రూ.80 లక్షల నష్ట పరిహారంతో పాటు ఒక ఉద్యోగాన్ని సాధించింది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వీడీఏ పాయింట్ అమౌంట్ ను రూ.8.50 నుంచి రూ.8.80 వరకు పెంచింది. 20 ఏళ్లుగా పెరుగని ఎల్డీఏ అమౌంట్‌ను గ్రేడ్- 1, 2కు రూ.753 నుంచి రూ.2,750 వరకు, గ్రేడ్ 3, 4కు రూ.1,000 నుంచి రూ.3,250, స్టాప్‌కు రూ.1,200 నుంచి రూ.3,750 వరకు పెంచిన ఘనత టీఆర్ఎస్ కేవీకే దక్కింది. వీటన్నింటి నేపథ్యంలో శనివారం జరగబోయే గుర్తింపు ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవీని మరోసారి గెలిపించాలని కార్మికులు సిద్ధమయ్యారు.
సీఐటీయూ కార్మికులను విస్మరిస్తూ స్వలాభాలకు పెద్దపీఠ వేస్తూ వస్తోంది. గడిచిన కొన్నేళ్లుగా కార్మికుల పొట్టకొట్టేందుకు ప్రయత్నం చేసింది. గతంలో వేతన ఒప్పందంలో రూ. 850 పెరిగిందని కార్మికులందరిని నమ్మబలికి కంపెనీ యజమాన్యంతో చీకటి ఒప్పందం చేసుకుని రూ.705కు తగ్గించి రాత్రికి రాత్రే దీక్షను భగ్నం చేసింది. సుమారు 300 మంది జూనియర్ కార్మికులందరికి వీడీఏ అమౌంట్ ను పూర్తిగా జీరో చేసి ఒక్కొక్క కార్మికునికి ప్రతి నెల రూ.8,000 నుంచి 3,000 వరకు నష్ట పరిచింది. గ్రేడ్-2 వర్కర్స్ ఉన్న టార్గెట్ ను గ్రేడ్-1 వర్కర్స్ కు వర్తింపజేసి గ్రేడ్-1 వర్కర్స్ పనిభారాన్ని పెంచి జూనియర్ కార్మికులను ఇబ్బందుల్లోకి నెట్టివేసింది. 2008లో సొంత అవసరాలకు, లాభాలకు లోబడి జనరల్ ఇన్సెంటివ్ టార్గెట్ రూ.13,00,000 వరకు ఉత్పత్తిని పెంచి మూడు నెలలకోసారి జనరల్ ఇన్సెంటివ్ డబ్బులను పూర్తిగా రాకుండా చేసింది. గత వేతన ఒప్పందంలో ప్రతిసారి ఉత్పత్తి టార్గెట్‌ను ఉన్నదాని కంటే 30 శాతం, 35 శాతం ఇలా పలుమార్లు టార్గెట్‌ను పెంచి, కార్మికులకు పెంచిన జీతభత్యాల కంటే రెట్టింపు లాభాన్ని ఉత్పత్తి రూపంలో యజమాన్యానికి రూ.కోట్లు దోసి పెట్టింది. ఈ క్రమంలో మరోసారి సీఐటీయూకి ఓటేస్తే తమ బ్రతుకులను యజమాన్యాల వద్ద తాకట్టు పెట్టడం ఖాయమని కార్మికులు భావిస్తున్నారు.
ప్రతి కార్మికుడికి ఇప్పుడున్న వేతనంతో కలుపుకుని రూ.18,000 వరకు వేతన ఒప్పందాన్ని సాధిస్తాం. స్టాఫ్ కార్మికులకు అదనంగా రూ.800 పెంచుతాం. బీఎఫ్ సీలింగు ఎత్తివేస్తాం. వీడీఏ పాయింట్ రేటును పెంచుతాం. ఈఎస్ఐ పరిధిదాటి ప్రతి కార్మిక కుటుంబానికి ఏడాదికి రూ.7,00,000 వరకు వైద్య బీమా పాలసీని పూర్తిగా యజమాన్యామే భరించేలా కృషి చేస్తాం. ఏదైనా ప్రమాదశాత్తు మృతి చెందిన కార్మిక కుటుంబాలకు వెంటనే ఒకరికి ఉద్యోగ భద్రత, లేనిచో మంచి ప్యాకేజీ అమౌంట్ ఇప్పిస్తాం. అర్హులైన కార్మికులందరికి ప్రమోషన్లు. వీడీఏ పాయింట్ ప్రస్తుతం ఉన్న రేటుకంటే రూ.2 నుంచి రూ. 3 వరకు పెంచుతాం. ప్రతి కార్మికునికి ప్రస్తుతం ఉన్న ఎన్డీఎ అమౌంట్ కంటే రెట్టింపు ఏజీఏ ఇప్పిస్తాం. పెస్టివల్ సెలవు, ఎస్ఎల్, సీఎల్ సెలవును పెంచుతాం. సీనియర్, జూనియర్ల సమన్వయంతో సమన్యాయ వేతన ఒప్పందాన్ని సాధిస్తాం. స్టాఫ్, వర్కర్స్ రిటైర్మెంట్కు ఒక నెల వేతనాన్ని అందజేస్తాం. రిటైర్మెంట్ నెల మధ్యలో ఉంటే ఆ నెల మొత్తం జీతాన్ని ఇప్తిస్తాం. మృతి చెందిన కార్మికుల అంత్యక్రియల ఖర్చుకు రూ.50,000 వరకు ఇప్పిస్తాం. మహిళా కార్మికులకు పూర్తి ఉద్యోగ భద్రత కల్పిచడంతో పాటు మెరుగైన మాలిక సౌకర్యాలను కల్పిస్తాం. కార్మికులంతా బీఎంఎస్ బలపర్చిన బీఆర్ఎస్ కేవీ బాణం గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.