చౌటుప్పల్ రూరల్: మోడీకి పతనమయ్యే కాలం ప్రారంభమైందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం మండల పరిధిలోని మందోళ్లగూడెం గ్రామంలో సీపీఎం పార్టీ 10వ గ్రామశాఖ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో పెద్ద రాష్ర్టాల్లో బీజేపీ పార్టీ ఓడిపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
బీజేపీ పార్టీ దెబ్బతింటున్నప్పటికీ దానికి ప్రత్యామ్నాయ శక్తులు ఐక్యంగా లేవన్నారు. ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ బలహీన పడుతుందని, దానికి సరైన నాయకత్వం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సభలో ఆపార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, నాయకులు కొండమడుగు నర్సింహా, అనురాధ, ఆర్.అంజయ్య, బూర్గు కృష్ణారెడ్డి, చెన్నబోయిన వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.