భువనగిరి అర్బన్, మార్చి 14 : కదులుతున్న రైలు ఎక్కబోయి కాలు జారడంతో ఓ వ్యక్తి ప్లాట్‌ఫామ్-రైలు మధ్యలో ఇరుక్కుపోయాడు. రైల్వే కానిస్టేబుల్ అప్రమత్తతో ప్రమాదం తప్పి వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. రైల్వే స్టేషన్ లోని సీసీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యం సోషల్ మీడియాతో వైరల్ అయింది. ఈ నెల 12వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో భువనగిరి రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జగదీశ్ అనే ప్రయాణికుడు నిజామాబాద్ వెళ్లేందుకు తన కూతురు అశ్విని, స్నేహితుడు శ్రీనివాస్‌తో కలిసి ఈ నెల 12వ తేది రాత్రి 8 గంటల 10 నిమిషాలకు భువనగిరి రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. నిజామాబాద్ వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు అప్పటికే ప్లాట్‌ఫారంపైకి వచ్చి కదులుతుంది. రైలును అందుకునేందుకు జగదీశ్ పరుగుతీశాడు. రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారడంతో ప్లాట్‌ఫామ్-రైలు మధ్య చిక్కుకుపోయాడు. అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ అది చూడడంతో వెంటనే స్పందించి జగదీశ్‌ను ప్లాట్‌ఫామ్ మధ్య నుంచి పైకి లేపాడు. దీంతో జగదీశ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కానిస్టేబుల్ సమయస్ఫూర్తికి రైల్వే అధికారులు, ప్రయాణికులు అభినందనలు తెలిపారు.